గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. తిరస్కరించింది. ఆయన పిటిషన్ మాత్రమే కాదు.. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్లను కూడా తోసి పుచ్చింది. అయితే తెదేపా ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పడిప్పుడే బెయిలు పొందడం సాధ్యం కాదని, కోర్టు తీర్పు అనూహ్యం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గన్నవరం తెలుగుదేశం మీద వల్లభనేని వంశీ తాను ఎమ్మెల్యేగా ఉండగా తన అనుచరులతో దాడిచేయించి.. విద్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి అప్పట్లోనే కేసులు పెట్టినా.. సర్కారు వైసీపీదే గనుక.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తిరగతోడడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ మరియు అనుచరుల మీద కేసు చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. ఈలోగా వల్లభనేని వంశీ ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయడం.. ఎస్సీ ఎస్టీ కోర్టులో, బెదిరింపుల ద్వారా, తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం.. కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం జరిగాయి. ఎస్సీ యువకుడి కిడ్నాపు కేసులో కూడా వంశీ అరెస్టు అయ్యారు. ఆ కేసులో ఆయనకు ఏప్రిల్ 8 వరకు రిమాండు విధించారు కూడా.
ఇంత గందరగోళం జరిగిన తర్వాత.. పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో బెయిలు రావడం కష్టం! ఎందుకంటే.. వంశీ బయట ఉన్నప్పుడు.. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారనే సంగతి రికార్డుల్లో ఉంది. అంతలా చేసిన వ్యక్తి.. మరోసారి బెయిలు మీద బయటకు వదిలితే.. కేసును మొత్తంగా దారి తప్పించగలడు కదా.. అనే వాదనకు న్యాయస్థానం ఎదుట బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల.. ప్రత్యేకించి.. పార్టీ ఆఫీసు మీద దాడికేసులో మాత్రం.. ఆయనకు విచారణ మొత్తం పూర్తయి శిక్షలు ఖరారయ్యే దాకా, కనీసం తీర్పు రిజర్వు అయ్యేదాకా బెయిలు దొరక్కపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు మరో కారణంకూడా ఉంది. పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు ఏ1 గా ఉన్న వంశీ అనుచరుడు రంగా రెండు రోజుల కిందటే అరెస్టు అయ్యారు. ఆయనకు కూడా ఏప్రిల్ 9 వరకు రిమాండు ఉంది. ఇవాళో రేపో సీఐడీ పోలీసులు రంగాను కస్టోడియల్ విచారణకు తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. రంగాను విచారించే సమయంలో విషయాలను ధ్రువీకరించుకోవడానికి, సమాంతరంగా వంశీని కూడా విచారించాల్సి ఉంటుందని.. ఆయనను కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో కేసులోని సంక్లిష్టత.. బయట ఉన్నప్పుడు వంశీ చేసిన పొరబాట్ల వల్ల ఆయనకు అంత త్వరగా బెయిలు రాదని పలువురు భావిస్తున్నారు.