వంశీకి బుద్ధొచ్చింది.. మిగిలినవాళ్లకు ఎప్పుడో?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిదీ ఒకటే ధోరణి. ఒక్కటే వ్యవహార సరళి! జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుడుకు పోకడలు ప్రదర్శిస్తూ ఉంటే.. అనుచరగణం మొత్తం అదే తరహాలో దుడుకు తనం ప్రదర్శిస్తుంటారు. రైతుల్ని, మరణించిన కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించడం అనే పనిమీద వెళుతున్నప్పుడు కూడా డీజేలు పెట్టి డ్యాన్సులు చేయిస్తూ వేల మంది జనాన్ని పోగేసుకుని వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఆయన అడుగుజాడల్లో నడవకపోతే ఎలా అనుకునే అనుచర నాయకులు.. తాము పోలీసుస్టేషనుకు వెళ్లి పూచీకత్తు సంతకాలు పెట్టాలన్నా,  కోర్టుకు హాజరు కావాలన్నా కూడా పదుల సంఖ్యలో వాహనాల్ని, వందల మంది మనుషుల్ని వెంటేసుకుని వెళ్లడం ఒక అలవాటుగా మార్చున్నారు.అయితే సుదీర్ఘకాలం రిమాండుఖైదీగా జైలులో గడిపి వచ్చిన తర్వాత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కొంచెం క్లారిటీ వచ్చింది. బుద్ధొచ్చింది. ఆర్భాటం లేకుండా కాస్త మెత్తబడ్డారు. కానీ మిగిలిన నాయకులకు ఎప్పుడు బుద్దొస్తుంది అనేదే ప్రజల్లో చర్చగా మారుతోంది.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద తన అనుచర గూండాలతో దాడి చేయించిన కేసు మాత్రమే కాదు, ఆ కేసును మాయ చేసేందుకు కంప్లయింటు ఇచ్చిన దళిత యువకుడిని కిడ్నాపు చేయించి నిర్బంధించి హింసించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించిన కేసు, ఇంకా భూదందాలు, అక్రమ మైనింగ్ దందాలు వంటి అనేక కేసుల్లో  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిలు లభించిన సంగతి అందరికీ తెలుసు. బెయిలు నిబంధనల ప్రకారం ఆయన గన్నవరం కోర్టుకు హాజరై అక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వంశీ ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరై అక్కడ సంతకాలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఒకరిద్దరు అనుచరులతో ఒక వాహనంలోనే వచ్చి వల్లభనేని వంశీ సంతకం చేసి వెళ్లడం గురించి జనం చర్చించుకున్నారు.

అనారోగ్యం పేరిట చాలాకాలంగా హైదరాబాదులోనే గడుపుతున్న కొడాలి నాని ఇటీవల ఒక కేసు విషయంలో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు గుడివాడ వచ్చారు. ఆయన గుడివాడ రావడమే ఒక పెద్ద యుద్ధానికి వెళుతున్నట్టుగా చాలా పెద్ద సంఖ్యలో మందీమార్బలాన్ని వెంటబెట్టుకుని మరీ స్టేషనకు వచ్చి సంతకాల పనులు పూర్తి చేసుకుని వెళ్లారు. అదే సమయంలో వివిధ కేసుల విషయంలో పోలీసులు విచారణకు పిలుస్తున్న సందర్భాల్లో వైసీపీ నాయకులందరూ కూడా అనుచరులను, లాయర్లను, తమ గణాలను వెంటబెట్టుకుని చాలా హడావుడిగా వెళుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేసే ఆర్భాటమే తామందరికీ స్ఫూర్తి అన్నట్టుగా  వారు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పెడపోకడల్లో వల్లభనేని వంశీ విషయంలో కొంత మార్పు వచ్చినట్టున్నదని.. మిగిలిన వారు ఎప్పటికి మారుతారోనని జనం అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories