ఒకవైపు వాలంటీర్లను నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో తెగ వాడేస్తున్నారు. ఇన్నేళ్లుగా ప్రజలతో మమేకమైన ఇంటింటికీ తిరుగుతున్న, ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న వాలంటీర్లను అనైతికంగా తమ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారు. అయితే, వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతున్న నేపథ్యంలో, నిబంధనలు మీరి వైసీపీ వారితో తిరుగుతున్నా, ఎన్నికల ప్రచారం చేస్తున్న వాలంటీర్లపై ఏకంగా వేటు వేస్తుండడంతో వైసీపీ నాయకులకు ఇబ్బంది తప్పడం లేదు. ఇందుకు విరుగుడుగా.. వారు ఏకంగా వాలంటీర్లను ఉద్యోగాలకు రాజీనామా చేసి తమతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరుతున్నారు. ఆ రకంగా వాలంటీర్ల కడుపుకొట్టే ఆలోచనను జగన్ అనుచరులు చేస్తున్నారని వాలంటీర్లు గొల్లుమంటున్నారు.
వాలంటీర్లు ఓవరాక్షన్ చేస్తూ వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో ఉంటే ఎన్నికల సంఘం వదలిపెట్టడం లేదు. కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురిని ఉద్యోగాలనుంచి తొలగించింది. పైగా వాలంటీర్లతో సమావేశాలు పెట్టుకున్నా కూడా.. అక్కడకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వచ్చేసి అడ్డుపడుతున్నారు. సమావేశానికి వచ్చిన వాలంటీర్ల ఫోటోలు తీసి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తలనొప్పులన్నీ లేకుండా.. అదే వాలంటీర్లను ఉద్యోగాలకు రాజీనామా చేయించేసి.. తమ ప్రచారానికి పూర్తిస్థాయిలో వాడుకోవాలని వైసీపీ అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఈ రెండు నెలల పాటూ గవర్నమెంటు ఇచ్చే జీతం మేమే ఇస్తాం అని, తమ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ మిమ్మల్ని తిరిగి వాలంటీర్లు ఉద్యోగాల్లోకి తీసుకుంటాం అని వారు ఆశ పెడుతున్నారు. వాలంటీర్లు ప్రతి యాభై ఇళ్లలోని ప్రజలతో బాగా సత్సంబంధాలు ఉండేవారు కావడంతో వారిద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం సులువు అవుతుందని ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు.
జగనన్న ప్రభుత్వం మళ్లీ ఏర్పడకపోతే ఇప్పుడొచ్చే పథకాలన్నీ ఆగిపోతాయి, పెన్షన్లు కూడా రావు. మీరు జగన్ కు ఓటేశారో లేదో కూడా మాకు తెలుస్తుంది. వేయకపోతే మా గవర్నమెంటు వచ్చాక మీకు అందుతున్న పథకాలు ఆపేస్తాం.. అంటూ ప్రజలను వాలంటీర్ల ద్వారా రకరకాలుగా భయపెట్టడానికి వారు పూనుకుంటున్నారు. వాలంటీర్లు మాత్రం తమ ఉద్యోగం పోతుందని భయపడుతున్నారు. ఇప్పుడు వారి ప్రచారానికి వాడుకోవడం కోసం బలవంతంగా రాజీనామాలు చేయించాలనుకుంటున్నారని, రేపు వైసీపీ ప్రభుత్వం రాకపోతే.. తమ పరిస్థితి ఏంటని వారు భయపడుతున్నారు.