వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పూర్వ కడప జిల్లా స్థానిక నాయకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం పరిధిలో మంగళవారం పర్యటిస్తుండడమే అందుకు కారణం. జగన్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున జనాన్ని తోలించాలని స్థానిక నేతలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గతంలో గుంటూరు జిల్లా రెంటపాళ్ల, సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లె, చిత్తూరు జిల్లా బంగారుపాళెంలలో వచ్చిన జనాన్ని మించి.. కడపజిల్లాలో జనసమీకరణ ఉండాలని పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ జనసమీకరణ చాలా ముఖ్యమని, ఎవ్వరూ విస్మరించవద్దని నేతల్ని హెచ్చరించినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు అన్నమయ్య జిల్లా పరిధిలోని ఆకేపాడుకు వెళ్లనున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్ లో జగన్ పాల్గొంటారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం 11.30కు వైఎస్ జగన్ రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లె వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆకేపాడు వెళ్తారు. అక్కడి ఆకేపాటి ఎస్టేట్స్ లో ఎమ్మెల్యే సోదరు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు.
వివాహ రిసెప్షన్ కు హాజరు కావడానికి జగన్ కోసం ఆకేపాటి ఎస్టేట్స్ లోనే ఒక హెలిపాడ్ ఏర్పాటుచేసుకుని ఉంటే సరిపోయేది. కానీ.. కొన్ని కిలోమీటర్ల దూరంలో బాలిరెడ్డిగారిపల్లె వద్ద ఏర్పాటుచేయడమే ఒక వ్యూహం అని పలువురు భావిస్తున్నారు. జగన్ కు రిసెప్షన్ వేదిక వద్దనే హెలిపాడ్ నచ్చదు. ఆయన రోడ్డమ్మట వాహనంలో ప్రయాణించాలి.. ఆయన వెంట మందలు మందలుగా జనం పరుగులు తీయాలి.. వాళ్లందరూ జేజేలు కొట్టాలి.. సీఎం సీఎం అని అరవాలి.. ప్రమాదాలు జరగాలి.. గాయపడాలి.. పోలీసులు లాఠీచార్జీ చేయాలి.. అంతింగా ప్రభుత్వం తనను చంపడానికి కుట్రలుచేస్తున్నదని, శాంతిభద్రతలు లేవని, పోలీసులు దుర్మార్గులని తాను రకరకాలుగా బురద చల్లాలి! ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కోరికలు.
అందుకే జనాన్ని విపరీతంగా తోలించాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి.. రాజంపేట నియోజకవర్గం పరిధిలోకే వచ్చే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలను ఇటీవలే ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ ఎన్నిక అక్రమంగా జరిగిందని, తన పట్ల ప్రజల్లో అభిమానం వెల్లువలా ఉన్నదని చాటుకోవాలంటే.. జనాన్ని పెద్ద సంఖ్యలో పోగేయడం అవసరం అని వారు భావిస్తున్నట్టుగా సమాచారం. జగన్ సొంత జిల్లాలో నిజాయితీగా, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసే పరిస్థితిలో ఎన్నికలు జరిగితే.. ఆయన బలం ఏపాటిదో మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. ఈ అవమాన భారం నుంచి ఇంకా తేరుకోని జగన్మోహన్ రెడ్డి.. గత అన్ని యాత్రలకంటె మిన్నగా ఆకేపాడు యాత్రలో జనాన్ని తరలించడం పార్టీ నేతలకు టార్గెట్ విధించినట్టు చెబుతున్నారు.