మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీడియా మైకు కనిపించడం పాపం.. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు మీద ఎలాంటి విమర్శలను కంఠస్థం చేశారో… ఇప్పుడు కూడా అదే జాబితాను ఏకరవు పెడుతూ.. విమర్శలు వల్లెవేస్తూ పోతారు. 2014 మేనిఫెస్టో దగ్గరినుంచి ఆయన పాచిప్రసంగం మొదలవుతుంది. సూపర్ సిక్సో సూపర్ సెవెనో.. ఏవీ ఎక్కడ.. అని అంటూ ఉంటారు. ఎన్నికలు పూర్తయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినెల నుంచి కూడా ఇదే మాట అంటూ ఉన్నారు జగన్. ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకుంటూ పోతోంది. అయినా.. ఆయన అదే మాటను వదిలిపెట్టడం లేదు. ఇంకా అదే అంటున్నారు. అయితే ఇలాంటి కువిమర్శలు చేసే వైసీపీ వారి నోర్లకు తాళాలు పడేలాగా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ రూపంలో రాష్ట్రంలోని మహిళలకు ఏదైతే హామీ ఇచ్చిందో.. దానికోసం నిరీక్షిస్తున్న వారికి.. అనూహ్యమైన మేలు, అదనపు ప్రయోజనం కలిగించేలా ఆ హామీని సవరించి అమలు చేయబోతోంది. అదే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ.
నిజానికి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించినప్పుడు.. తెలుగుదేశం పార్టీ.. మహిళలకు తమ సొంత జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తాం అని చెప్పింది. సొంత జిల్లా అంటే.. వారు నివసించే ప్రాంతపు ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకోవచ్చునని అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు ఆలోచన మరింత విశాలం అయింది. మహిళలకు మరింతగా మేలు చేయాలని తలపోశారు. అందుకే మంత్రుల, అధికారుల బృందాన్ని ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న వివిధ రాష్ట్రాలకు పంపి, ఆయా రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నదో అధ్యయనం చేయించారు. ఆ నివేదికలన్నీ అందిన తర్వాత.. దేశంలో మరెక్కడా లేనంత గొప్పగా.. మన రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తాం అని చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే సత్యం అవుతోంది.
మహిళలకు కేవలం వారి సొంత జిల్లాల్లో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించబోతున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మహిళలకు అయిదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి నారా లోకేష్. సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడడం కూడా జరిగిందని అచ్చెన్నాయుడు చెబుతుండడం విశేషం.
రాష్ట్రంలోని మహిళలకు చెప్పినదానికంటె చాలా గొప్పగా ఈ హామీని అమలు చేస్తున్న నేపథ్యంలో.. ఇన్నాళ్లూ దీనికోసం నానా యాగీ చేసిన వైఎస్సార్ సీపీ దళాలు ఇక తమ మొహం ఎక్కడ పెట్టుకుంటాయో అర్థం కాని పరిస్థఇతి. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం టైమ్ లైన్ ప్రకారం హామీలు అమలు చేస్తుందనే క్లారిటీలేక కువిమర్శలు చేసిన వారు ఇప్పుడు నోర్లు మూసుకోవాల్సిన పరిస్థితి అని అంతా అంటున్నారు.