ఏపీ ప్రజల్ని రంజింపజేస్తున్న రేవంత్ జోకులు!

‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాడట వెనకటికి ఒక మహాప్రబుద్ధుడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఏదో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభను కాస్త ఆర్భాటంగా నిర్వహిస్తూ, అతిథిగా ఆహ్వానించిన పాపానికి ఆయన షర్మిల జీవితం నలుగురిలో నవ్వుల పాలయ్యే తరహా ప్రసంగంతో కామెడీ చేస్తున్నారు. జోకులు వేస్తున్నారు. 2029 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నిన్న మొన్నటిదాకా ఇసుమంతైనా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ సారథిగా ఉన్నటువంటి వైయస్ షర్మిల రాష్ట్రంలో ప్రచారానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి చుట్టూ పలుమార్లు తిరిగినా ఆయన పట్టించుకోలేదు. చివరికి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్లారు. కనీసం వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడపకు ఒక పర్యాయం కూడా రేవంత్ అడుగుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడో శవాసనం వేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏమాత్రం మెరుగైన ప్రదర్శన చూపలేకపోయింది. ఓటు శాతాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. 
తీరా ఇప్పుడు వైఎస్ జయంతి కోసం ఏపీలో అడుగుపెట్టి రాబోయే నాలుగేళ్లలో అధికారంలోకి వచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలపడిపోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందట! తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి షర్మిల శక్తివంచనలేకుండా పాటుపడ్డారు. చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ తగు ఫలితం మాత్రం ఆమెకు దక్కలేదు. కనీసం ఆ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ షర్మిల అస్తిత్వం కూడా ఉండకుండా బయటికి గెంటేసారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగని ఆమె ఏపీ సారధి అయిన తర్వాత ఆయన అందించిన సహకారం ఎంత మాత్రమూ లేదు. కాగా ఇప్పుడొచ్చి 2029 కల్లా షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుందని, తాను ఆమె వెన్నంటి నిలుస్తానని ఆయన ప్రకటించడం చూసి  ప్రజలు నవ్వుకోవడం తప్ప మరేం చేయగలరు.

Related Posts

Comments

spot_img

Recent Stories