తెలుగుదేశం పార్టీ ఈసారి కేంద్రప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నది. ఎన్డీయే కూటమిలో రెండో అతి పెద్ద పార్టీ తెలుగుదేశం మాత్రమే. పైగా భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ దాటేంతటి సీట్లు దక్కలేదు. కాబట్టి కేంద్రంలో తెలుగుదేశం మీద అనివార్యంగా ఆధారపడవలసిన పరిస్థితి. ఆ ప్రకారం చూసినప్పుడు.. కేంద్రమంత్రివర్గంలో కూడా తెలుగుదేశానికి తగుమాత్రం ప్రాధాన్యం దక్కుతుందనే అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని పలువురు అంచనా వేస్తున్నారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో మాత్రమే కాదు.. అసలు లోక్ సభలోనే చాలా పద్ధతిగా పాయింట్ మాట్లాడే ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం తరఫున గెలిచిన ఎంపీల్లో సీనియర్ కూడా అవుతారు. పైగా రాష్ట్ర ప్రయోజనాల పట్ల శ్రద్ధ ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన నియోజకవర్గం మాత్రమే కాకుండా.. ప్రజలు కింజరాపు వారి కుటుంబాన్ని ఇప్పటికీ సమానంగా ఆదరిస్తున్నారంటే, కింజరాపు ఎర్రన్నాయుడును స్మరించుకుంటున్నారంటే.. అందుకు రామ్మోహన్ పనితనం కూడా ఒక కారణం.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో చేరడం అంటూ జరిగితే.. ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం సవ్యంగా మనుగడ సాగించడానికి కేంద్రం నుంచి అనేక విధాలుగా సాయం అర్థించవలసి వచ్చే సమయంలో.. మంత్రి వర్గంలో చేరడమే మంచి పద్ధతి.
అదే సమయంలో తెలుగుదేశంలోని మరికొందరు ఎంపీలకు కూడా మంత్రి పదవులు లభించవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఉంటుందనే ఊహాగానాలు పార్టీలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు బుధవారం నాడు ఎన్డీయే సమావేశానికి ఢిల్లీ వెళ్లినప్పుడు.. ఈ ఇద్దరు నాయకులనూ వెంటబెట్టుకుని వెళ్లారు. తెలుగుదేశానికి ఈసారి రెండు కంటె ఎక్కువ కేంద్రమంత్రి పదవులు దక్కవచ్చునని కూడా అనుకుంటున్నారు.