సాధారణంగా ఒక పని చేసినప్పుడు.. ఆశించిన ఫలితం దక్కకపోగా, పని చెడిపోయినప్పటికీ కూడా ఆ పని తాలూకు కష్టనష్టాలు, చేదు పర్యవసానాలు మాత్రం అనుభవించాల్సి వచ్చినప్పుడు.. ‘బిడ్డ చచ్చినా పురిటివాసన పోలే’దనే సామెతతో వ్యవహరిస్తుంటారు. ఏదో ఆశించి ఒక పనిచేశారు.. వికటించింది.. అనుభవిస్తున్నారు.. అని వారి ప్రారబ్ధం గురించి సరిపెట్టుకోవచ్చు. కానీ.. అసలు ఏ పనీ చేయకుండానే.. కష్టనష్టాలు మాత్రం వచ్చి చుట్టుమడితే దానిని ఏం అనుకోవాలి. ‘బిడ్డ పుట్టనేలేదు.. పురిటివాసన మాత్రం పోలేదు’ అని అనుకోవాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి జమానాలో డిప్యూటీ ముఖ్యమంత్రి అనే హోదాలో పనిచేసిన నారాయణ స్వామి పరిస్థితిని చూసినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. అప్పట్లో ఎక్సయిజుశాఖకు మంత్రిగా కూడా చేసిన నారాయణస్వామిని.. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సిట్ దర్యాప్తు బృందం విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఇప్పటిదాకా నలభై మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 11 మంది జైల్లోనే ఉన్నారు. 22 మందిని పైగా విచారించారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా.. ఆ సమయంలో ఎక్సయిజు శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నారాయణస్వామి పేరు ఎక్కడా వినిపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో మంత్రులను డమ్మీలుగా మార్చి.. డైరక్టుగా జగన్ మార్గదర్శకత్వంలోనే బయటి వ్యక్తులు, ఇతరులు ఏ రకంగా ప్రభుత్వ నిర్ణయాలను శాసిస్తూ ఉండేవారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త లిక్కర్ పాలసీ తయారైంది. ఆ లిక్కర్ పాలసీ రూపకల్పన విధివిధానాలు, ఏ రకంగా డిస్టిలరీలనుంచి వేల కోట్లు దోచుకోగలమోననే మార్గాల అన్వేషణ తదితర చర్చల కోసం తొలిదశలోనే విజయసాయిరెడ్డి ఇంట్లో పలు విడతలుగా సమావేశాలు కూడా జరిగాయి. అప్పటి సీఎం జగన్ అనుంగు సహచరులు ధనంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, అధికారులు వాసుదేవరెడ్డి తదితరులు కలిసి చర్చలు జరిపి పాలసీకి తయారుచేశారు. ఈ వ్యవహారం మొత్తం కనీసం ఎక్సయిజు మంత్రికి కూడా తెలియకుండా, ప్రమేయం లేకుండా ఆశ్చర్యం లేదు.
జగన్ మంత్రుల్ని డమ్మీలుగా మార్చి వారి అన్ని శాఖల నుంచి కూడా తన తరఫునే సింగిల్ విండో తరహాలో దోచుకునే వాడనే ఆరోపణలు కొత్త కాదు. ఆయన సొంత మామ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా.. తాను మంత్రి అయినప్పటికీ కూడా అదానీ విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు తన ప్రమేయం లేకుండానే జరిగాయని వాపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఆ రకంగా పాపం లిక్కర్ స్కామ్ తో అప్పటి ఎక్సయిజు మంత్రికి ఏం సంబంధం లేకపోయినప్పటికీ.. ఇప్పుడు ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి వస్తోంది. ఆయన చేసిందేమీ లేదు, ఆయనకు దక్కిందేమీ లేదు.. నిజానికి ఆయనకు తెలిసిన విషయాలు కూడా ఏమీ ఉండకపోవచ్చు.. ఎందుకంటే ఎవరూ ఆయనకు ఏమీ చెప్పి ఉండకపోవచ్చు. అయినా సరే.. పాపం నారాయణస్వామి సిట్ విచారణకు హాజరుకావాల్సి వస్తోంది. విచారణఖు వెళ్లినంత మాత్రాన వచ్చే ఇబ్బందేం లేదని, ఆయనను కేవలం సాక్షిగా కొన్ని వివరాలను ధ్రువీకరించుకోవడానికి మాత్రమే సిట్ పిలుస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు.