ఈవీఎం ధ్వంసం కేసు సంగతి సరే.. ఏకంగా సీఐ మీదనే దాడిచేసినందుకు తనమీద నమోదైన హత్యాయత్నం కేసు మొదటికే మోసం తెస్తుందని భయపడుతూ వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి.. హైకోర్టు ఏదో తాత్కాలిక ఊరట ఇచ్చింది గానీ.. ఇంకా పుట్టెడు కష్టాలు చుట్టుముట్టే ఉన్నాయి. ఈ సిటింగు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రతిరోజూ ఎస్పీ ఆఫీసుకు వెళ్లి.. అక్కడ సంతకం పెట్టవలసిన అగత్యం ఏర్పడింది. ఆయన అభిమానులే ఆయన పట్ల జాలి వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు పుణ్యమా అని పిన్నెల్లి కొన్ని రోజుల పాటు అరెస్టు తప్పించుకోగలిగారు గానీ.. ఇప్పుడు ఉన్నపళంగా కలుగులోంచి బయటకు రావాల్సి వచ్చింది.
ఈవీఎం ధ్వంసం కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి.. హైదరాబాదులో పోలీసుల కళ్లుగప్పి అరెస్టు తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. పోలీసులనుంచి ఒక విడత తప్పించుకున్న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి.. జూన్ 6వ తేదీవరకు ఆయనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు కరుణించినప్పటికీ.. ఆయనకు పూర్తి ఊరట దక్కలేదు. సీఐ మీద చేసిన దాడికి సంబంధించి ఆయన మీద హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఇంకా మొత్తం మాచర్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన దాడులు, దహనాలకు సంబంధించి ఏకంగా ఆయన మీద 9 కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటి నుంచి కూడా రక్షణ కావాలని ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్లు మాత్రమే కాదు, పోలీసుల తరఫు పీపీ కూడా.. సీఐమీదనే దాడికి తెగబడిన వ్యక్తి అరెస్టును ఆపేలా ఉత్తర్వులు ఇవ్వవద్దని విన్నవించినప్పటికీ.. కోర్టు ఆయనను మన్నించింది. ఏ కేసుకు సంబంధించి కూడా.. ఆయన మీద జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆయన కౌంటింగ్ ముగిసేవరకు మాచర్ల నియోజకవర్గంలోనే అడుగుపెట్టడానికి వీల్లేదనే ఉత్తర్వులు అలాగే ఉన్నాయి.
కోర్టు ఉత్తర్వుల తర్వాత.. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి అనివార్యంగా అజ్ఞాతం నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఆయన ప్రతిరోజూ ఎస్పీ ఆఫీసుకు వెళ్లి సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారమే ఎస్పీ ఆఫీసుకు వెళ్లి సంతకం పెట్టారు. ఇక కౌంటింగ్ వరకు ప్రతిరోజూ ఈ డ్యూటీ ఉంటుందన్నమాట. 4వ తేదీ ఫలితాల్లో మాచర్లనుంచి ఎవరు గెలిచినా సరే.. 6వ తేదీన పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేయడం మాత్రం గ్యారంటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.