పాపం పెద్దిరెడ్డి.. సమర్థించుకోవడం రావట్లేదే!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏడేళ్ల బాలిక కిడ్నాప్ మరియు హత్యకు గురైన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అందుకోసమే పుంగనూరు వెళుతున్నట్టుగా పార్టీ ఆయన షెడ్యూలును ప్రకటించింది. ఈలోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి పుంగనూరు వెళ్లి తమ అధినేత రాకకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈలోగా హత్యకేసులో నిందితులు అరెస్టు కూడా జరగడంతో మొత్తం మారిపోయింది. జగన్ పర్యటన రద్దయింది. ఎందుకు రద్దయిందో.. సమర్థించుకోవడం లేదా వివరణ చెప్పడం పాపం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేతకావడం లేదు.

పెద్దిరెడ్డి తిరుపతిలోని తన నివాసంలో విలేకరులతో వివరణ చెప్పారు. పుంగనూరు హత్యోందంతం తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం బాగా స్పందించిందని, ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్టయ్యేలా చూశారని ఆయన అన్నారు. మధ్యలో కర్నూలు ఘటనలో కూడా ప్రభుత్వం ఇలాగే స్పందించి ఉంటే బాగుండేదని సన్నాయినొక్కులు నొక్కారు. అంతకంటె కామెడీ ఏంటంటే.. తమ నేత జగన్ పర్యటిస్తున్నారని తెలియడం వల్లనే.. కంగారు పడి ప్రభుత్వం తరఫున మంత్రులు వచ్చి ఇక్కడ కేసును పరిష్కరించినట్టుగా పెద్దిరెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. సరే.. పోన్లే.. అలా సొంత డబ్బు కొట్టుకోనిద్దాం, కాసేపు ఆయన చెప్పినదే నిజమని అనుకుందాం.

ఇంతకూ జగన్ పుంగనూరు వెళతానన్నది.. నిందితులను అరెస్టు చేసేలా పోలీసులను ఆదేశించడానికి గానీ, స్వయంగా కేసును పరిశోధించి నిందితులెవరో తేల్చడానికి గానీ కాదు కదా! కేవలం ఒక బాలిక హత్యకు గురైతే ఆమె కుటుంబం కన్నీళ్లు తుడవడానికి కదా.. ఆయన వెళతానని చెప్పినది. నిందితులు అరెస్టు అయినంత మాత్రాన, ప్రభుత్వం పెద్దలు వచ్చి వెళ్లినొంత మాత్రాన ఆ కుటుంబానికి కన్నీళ్లు లేకుండా ఉంటాయా? జగన్ నిజంగా చిత్తశుద్ధితో వారిని ఓదార్చాలని అనుకుంటే అందుకు అవకాశమే ఉండదా? అరెస్టుల తర్వాత వెళితే తప్పయిపోతుందా? పెద్దిరెడ్డికి పాపం.. జగన్ టూర్ క్యాన్సిల్ కావడాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియలేదు. ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

నిజానికి జగన్మోహన్ రెడ్డి చాలా సంకుచిత బుద్ధితో పుంగనూరుటూరు ప్లాన్ చేసుకున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన బాలిక హత్యకు గురికాగానే.. దానిని అత్యాచారంగా కూడా పులిమి ప్రచారం చేసి.. చంద్రబాబు ప్రభుత్వంలో అటు మహిళలకు, ఇటు మైనారిటీలకు భద్రతలేదని గొంతెత్తి అరవాలని అనుకున్నారు. కానీ.. కేసే తేలిపోవడం, హత్య కారణాలు వేరు కావడంతో.. ఆయనకు అలాంటి అవకాశం దక్కదని తెలిసిపోయింది. వెళ్లి, అలాంటి ఆరోపణలు చేస్తే పరువుపోతుందని భయపడ్డారు. పాపం పెద్దిరెడ్డి జాగ్రత్తగా సమర్థించుకుని ఉంటే బాగుండేది. అది ఆయనకు చేతకాలేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories