ఉండవిల్లి శ్రీదేవి తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీద ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాడికొండ ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. సుమారు ఏడాది కిందట తెలుగుదేశానికి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి.. తర్వాత అనర్హత వేటుకు కూడా గురైన శ్రీదేవి తెలుగుదేశంలో చేరారు.
అయినప్పటికీ.. ఆమె ప్రస్తుతం టికెట్ దక్కలేదు. తనకు తిరువూరు అసెంబ్లీ టికెట్ గానీ, బాపట్ల ఎంపీ టికెట్ గానీ కావాలని ఆమె ఆశించారు. కానీ దక్కకపోవడంతో అలకపూనారు. ‘‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’’ అని వుండవిల్లి శ్రీదేవి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఆ పోస్టుకింద హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని పెట్టి దాని పక్కనే ఒక కత్తి బొమ్మ పెట్టకపోతే గనుక.. ఆమె ట్వీట్ గురించి చర్చ జరిగేదే కాదు. ఆమె అలకపూనినట్టుగా అర్థమయ్యేది కూడా కాదు.
ఆమె కోరుకున్నట్టుగా టికెట్ దక్కలేదు సరే.. నిన్న గాక మొన్న తెలుగుదేశంలోకి వచ్చిన (అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనను పూర్తిగా లూప్ లైన్లోకి పెట్టేసిన తర్వాత.. తనకు వేరే గత్యంతరం లేకుండాపోయిన తర్వాత మాత్రమే) ఉండవిల్లి శ్రీదేవి ఒక్క ఫిరాయింపు ఓటు వేసినందుకు ప్రత్యుపకారంగా టికెట్ ఆశించడం ఒక చిత్రం. పోనీ ఆశించారే అనుకుందాం.. తాను సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాడికొండ నియోజకవర్గాన్ని కాకుండా ఆమె తిరువూరును ఎందుకు కోరుకున్నట్టు?
ఆ రహస్యం అందరికీ తెలిసినదే. డాక్టరుగా రోరింగ్ ప్రాక్టీసు ఉన్న ఉండవిల్లి శ్రీదేవి వైసీపీ టికెటు మీద తాడేపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో చేయని దందా లేదు. అరాచకం లేదు. పాల్పడని అవినీతి లేదు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది తమకు తోచినరీతిలో విచ్చలవిడిగా దందాలు సాగించారు గానీ..
ఉండవిల్లి శ్రీదేవి స్థాయిలో భ్రష్టుపట్టిన వారు లేరు. నియోజకవర్గంలో అపరిమితమైన అపకీర్తి మూటగట్టుకున్నారు. తీరా జగన్ ఇన్చార్జిని మార్చిన తర్వాత అలిగారు. తెలుగుదేశంలోకి వచ్చారు సరే.. గెలిచిన చోట తనకు మళ్లీ ఠికానా లేదని అర్థమై ఆమె తిరువూరు సీటును కోరుకున్నారు. లేదా, బాపట్ల ఎంపీ సీటు కావాలని అడిగారుట. గెలిచినప్పుడు అంత దారుణమైన అవినీతికి పాల్పడకుండా కొంచెమైనా క్లీన్ రికార్డ్ ఉన్నట్లయితే బహుశా టికెట్ దక్కేదేమో. కానీ.. మచ్చ పడకుండా, మచ్చ వలన ఒక్కసీటు పోయినా పార్టీకి మొత్తంగా నష్టం అనే భయంతో ఆచితూచి టికెట్లు ఇస్తున్న చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వలేదు.
అందువలన అలిగి.. ఇలాంటి ఓవరాక్షన్ తో పోస్టు పెట్టడం ఆమెకే నష్టం అనే వాదన పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. కనీసం ఆమె సైలెంట్ గా ఉండి.. పార్టీకోసం తను చేయగలిగినంత పనిచేసి ఉంటే, తెదేపా సర్కారు వచ్చిన తర్వాత.. ఏదైనా పదవులు అడగడానికి అవకాశం ఉండేదని, ఇప్పుడు ఈ ట్వీటు ద్వారా అలాంటి భవిష్యత్తును కూడా ఆమె నాశనం చేసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.