ఉండవల్లి అరుణ్ కుమార్.. మేధావి ముసుగులో ఉండే ఒక రాజకీయ నేత! రాజకీయంగా ఎవరి ప్రయోజనాలకోసం అయినా ఆయన సునాయాసంగా మొగ్గుతారు. కానీ.. అనేకమంది ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఆయనకు రాలేదు. రామోజీరావు ను శత్రువుగా భావించి ఆయన పతనం చూడాలని కలగన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మంత్రించిన అస్త్రంలాగా ఉండవిల్లిని ఆయన మీదకు ప్రయోగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినా సరే.. ఆ అస్త్రం మాత్రం రామోజీ మీద పోరాటం కొనసాగిస్తూనే వచ్చింది. ఆయన అరెస్టు లక్ష్యంగా కేసులు నడుపుతూ వచ్చింది. కానీ.. ఇప్పుడు ఈ ఉండవిల్లిలో హఠాత్తుగా మార్పు వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. రామోజీరావు మరణించిన తర్వాత.. ఆయనను కీర్తించడం మాత్రమే కాదు. ఆయన ఫైటర్ అని కితాబులివ్వడం మాత్రమే కాదు. ఇక మీదట ఆయనపై పోరాటం ఉండదని కూడా ఉండవిల్లి అంటున్నారు.
అయితే ఇన్నాళ్లపాటూ మార్గదర్శి చందాదారుల్ని మోసం చేస్తూ రామోజీరావు చేస్తున్న పోరాటం మీదనే తన పోరాటం అని, తాను కేసులు నడుపుతున్నది వ్యక్తుల మీద కాదు అని రకరకాలుగా సన్నాయి నొక్కులు నొక్కిన ఉండవిల్లి అరుణ్ కుమార్… ఇప్పుడు మాత్రం ‘అసలు రామోజీరావే లేకుండాపోయిన తర్వాత ఇక పోరాటం ఏముంది.. ఉండదు’ అని ఎందుకు అంటున్నారు? అనేది సామాన్యులకు అర్థం కాని సంగతి.
కానీ, ప్రజలు చెప్పుకుంటున్న భాష్యం ఇంకోరకంగా ఉంది. ఉండవిల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి.. మేధావి అయిన సామాన్యుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన విధేయులను అందలాలు ఎక్కించే అలవాటు ఉన్నవారు గనుక.. ఉండవిల్లిని ఎంపీని చేశారు. అందుకు కృతజ్ఞతగా రామోజీరావు పతనం కోసం వైఎస్ ప్రయోగించిన బాణంలాగా పోరాడుతూ వచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత ఉండవిల్లి పోరాటం ఆపి ఉండవచ్చు. లేదా, వైఎస్ జగన్ పార్టీలో చేరి ఆయన అనుచరుడుగా చెలామణీ అయి ఉండచ్చు. కానీ.. వైఎస్ కు సన్నిహితులైన నాయకులకు జగన్ పార్టీలో మర్యాద లేదని ముందుగానే గ్రహించిన ఉండవిల్లి.. జగన్ ద్వారా అనుచిత ప్రయోజనాలు పొందుతూ.. జగన్ కూడా కోరుకుంటున్న రామోజీ పతనం కోసం పోరాడుతూ వచ్చారని ప్రజలు అంటున్నారు. ఉండవిల్లి పోరాటాలను ఆధారం చేసుకుని రామోజీని అరెస్టు చేయడానికి జగన్ చాలా ప్రయత్నించారని కూడా అంటున్నారు. అవేమీ సాధ్యం కాకపోగా.. ఇప్పుడు జగన్ పతనం అయ్యారు. ఆ పార్టీ సాధించిన సీట్లను గమనిస్తే మళ్లీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఉండవిల్లికి కూడా సన్నగిల్లిపోయినట్టు ఉంది. రామోజీరావు ఇక లేరు, ఇక జగన్ ద్వారా దక్కే ప్రయోజనాలు కూడా లేవు. అందుకే.. ఆయన పోరాటాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటన చేసి ఉంటారని ఊహాగానాలు సాగుతున్నాయి.