మేనమామకు షాక్.. ఇక మిగిలింది జగనే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో ఆ పార్టీ కిందిస్థాయి కార్యకర్తల్లో అనేక సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వాన్ని పాలించడం చేతకాలేదు సరే.. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీ పునర్నిర్మాణం పేరిట సాగిస్తున్న పసలేని ప్రయత్నాలు, సీనియర్ గట్టి నాయకులందరూ ఒక్కొక్కరుగా పార్టీని వదలి వెళ్లిపోతున్న వైనం.. ఇవన్నీ కలిసి కార్యకర్తలకు పార్టీ భవిష్యత్తు గురించి విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నాయి. అవకాశం ఉన్న వారు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలో తెలుగుదేశం, జనసేన పరం అవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా ఆయనకు షాక్ తగిలింది. ఈ షాక్ మామూల్ది కాదు. ఎందుకంటే.. ఆయన సొంత మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కమలాపురంలో అనేకమంది వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ సహా తెలుగుదేశంలో చేరిపోయారు. 

జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి కౌన్సిలర్లను బుజ్జగించడానికి, పార్టీ మారకుండా చూడడానికి చివరి వరకు తన వంతు ప్రయత్నం చేశారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. చేసిన పనులకు జగన్ హయాంలో కూడా బిల్లులు చెల్లించలేదని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేకుండా పోతున్నదని అంటూ వారంతా తెలుగుదేశం వైపు మళ్లారు. చంద్రబాబునాయుడు సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు గమనిస్తే.. ప్రజలు ఆ పార్టీని మళ్లీ మళ్లీ గద్దెపై కూర్చోబెడతారనే నమ్మకంతోనే కౌన్సిలర్లు పార్టీ మారుతున్నట్లు చెబుతున్నారు. 

కడపజిల్లా రాజకీయాల్లోనే మరొక ట్విస్టు ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ నెక్ట్స్ ఫోకస్ డైరెక్ట్ గా పులివెందుల మునిసిపాలిటీనే అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజం చెప్పాలంటే.. సుమారు రెండు నెలల కిందటే పులివెందుల మునిసిపాలిటీ తెలుగుదేశం వశం కావడానికి రంగం సిద్ధమైంది. పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెదేపా నాయకులతో టచ్ లోకి వచ్చి తాము పార్టీ మారుతాం అని నిర్ణయం చెప్పేశారు. అయితే.. పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగిరిగే తనుక.. జగన్ పరువు సమూలంగా నాశనం అయిపోతుందని భయపడిన పార్టీ వేగంగా చర్యలు తీసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి వారందరితో మాట్లాడి బుజ్జగించారు. బిల్లులు ఇప్పిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రకరకాల హామీలు ఇచ్చి మొత్తానికి వారు పార్టీ మారకుండా, పరువు పోకుండా జాగ్రత్తపడ్డారు. తీరా ఇప్పుడు కమలాపురం కూడా తెదేపా వశమైన తర్వాత.. వారు మళ్లీ పులివెందులను దక్కించుకోవడంపై దృష్టిపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories