వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? ఈ ప్రశ్న రాష్ట్రంలో ఎంతమందిని అడిగితే అన్ని రకాల సమాధానాలు వస్తాయి! అయితే ఒక కీలకమైన కారణం.. జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి బోధపడింది. జగన్ కు మాత్రం ఇంకా బోధపడలేదని అనిపిస్తోంది. అందుకే ఆయన ఓటమిని అంగీకరించకుండా ఈవీఎం మోసాలు, ప్రత్యర్థుల మోసాలు అంటూ తనని తానుమోసం చేసుకునే మాటలు ఇంకా చెబుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకీ జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి బోధపడిన సదరు కీలకమైన ఒక కారణం ఏమిటి? తమ పార్టీకి చెందిన వారే కొందరు తనను మోసం చేశారట. వారు చేసినమోసం కారణంగానే ఓడిపోయారట. మోసం చేసిన వారు ఎవరో కూడా తనకు తెలుసునని.. బాలినేని అన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి- నియోజకవర్గ ప్రజల కోసం, వారి కష్టాలను గమనించడం కోసం జిల్లాకు వచ్చినట్టుగా కనిపించలేదు. తన వియ్యకుండు కడుతున్న విల్లాల్లోకి సుబ్బారావు గుప్తా తన మనుషులతో వచ్చి రభస చేస్తే.. దానికి సంబంధించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను తిట్టడం కోసం మాత్రమే వచ్చినట్టుగా వ్యవహరించారు. ‘మా వియ్యంకుడు కట్టే విల్లాల వద్దకు మనుషుల్ని పంపితే చెప్పుతో కొడతా, చేతకానివాళ్లం అనుకున్నావా.. తెగించామంటే ఎవడికీ అందదు’ అంటూ ప్రెస్ మీట్ లో రెచ్చిపోయి మాట్లాడారు.
మొత్తానికి ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రాధేయపడినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలు ఎందుకంత దారుణంగా ఓడించారో అర్థం కాలేదని వాపోయిన బాలినేని.. అసలు కారణం సొంత పార్టీ వారు చేసిన మోసమే అనడం గమనార్హం. రాష్ట్రంలో ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఇలా సొంత పార్టీ వారే ముంచేశారని తమ ప్రెవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. కాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా చంద్రబాబు ఏదో మాయ చేసి, మోసం చేసి గెలిచారని.. ప్రజల్లో తన పట్ల అభిమానం అలాగే ఉన్నాయని బుకాయిస్తుండడం విశేషం.
జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు పరిశీలిస్తున్నారనే వార్తలపై కూడా బాలినేని మండిపడ్డారు. జిల్లా గొడ్డుపోలేదని, ఇక్కడి నాయకులకే పదవి ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేశారు. మామయ్య మాటను చెవిన వేసుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి మానేసిన జగన్ కు, ఈ సలహాలు మాత్రం వినిపిస్తాయో లేదో!!