జగన్ మామయ్యకు బుర్రలేదా? అర్థం కాదా?

సాధారణంగా రాజకీయ నాయకులు ఏదో ఒక పాయింటు దొరికితే చాలు తమ ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి, అర్థం పర్థంలేని విమర్శలు చేయడానికి అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ ఒక పాయింటు దొరక్క పోయినా సరే.. సగం పాయింటు దొరికినా సరే.. పూర్తి అంశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా విమర్శలకు దిగేవారిని, బురద చల్లడానికి ప్రయత్నించే వారిని ఏం అనాలి? సూటిగా చెప్పాలంటే.. పోచిమరెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి అనాలి. కన్ఫ్యూజ్ కాగండి అలాఅంటే మరెవ్వరో కాదు. ప్రస్తుతం కడపజిల్లా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే. అంటే మరెవ్వరో కాదు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి స్వయానా మేనమామ!
కడప జిల్లా పేరుకు సంబంధించి ఇప్పుడు వివాదం నడుస్తోంది. అసలే అసహనంలో ఉన్న ఈ రవీంద్రనాధ్ రెడ్డి ఆ వివాదాన్ని తన మైలేజీకోసం వాడుకోవాలని అనుకున్నారు. ఇంతకీ వివాదం ఏమిటి? అందులో ఉన్న పాయింటు ఏమిటి? అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వం మీద బురదచల్లుడు స్టార్ట్ చేసేశారు. అందుకే ఆయన గురించి జనం నవ్వుకుంటున్నారు.

ఇంతకూ చర్చ ఏంటంటే.. ఈ జిల్లాపేరులో కడప అనే పదాన్ని కూడా జోడించాలని రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం జిల్లా పేరు కేవలం ‘వైఎస్సార్ జిల్లా’ అని మాత్రమే ఉంది. నిజానికి ఇది ‘కడప జిల్లా’గా మాత్రమే గతంలో ఉండేది. తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిని చేర్చుకోవడానికి ద్వారంవద్ద ఉండే కడపలాంటి ప్రదేశం కావడంతో.. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం దృష్ట్యా దీనికి కడప అనే పేరు వచ్చింది. బ్రిటిషు పాలనలో ఇంగ్లిషు వాడికి నోరు తిరక్క CUDDAPAH అనే స్పెలింగుతో ఈ కడపను ఉచ్ఛరిస్తే.. కొన్ని దశాబ్దాల తర్వాత.. మన వాళ్లు మేల్కొని దాని స్పెలింగు KADAPA అని మార్చి గౌరవం కాపాడుకున్నారు. ఈలోగా 2009లో ఈ జిల్లాకు చెందిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూనే మరణించారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరును జిల్లాకు జోడించి.. ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని నామకరణం చేసింది. అప్పటినుంచి జగన్ దీనిపై పల్లెత్తు మాట అనలేదు. కానీ 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చిన్న జిల్లాల ఏర్పాటు సమయంలో జిల్లా పేరులోంచి ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న ‘కడప’ అనే పదాన్ని తొలగించేశారు. కేవలం ‘వైఎస్సార్ జిల్లా’ అని మాత్రమే పెట్టారు.
ఆ విషయంలో సత్యకుమార్ సీఎంకు లేఖ రాస్తే.. జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి పూర్తి విషయం తెలుసుకోకుండా జిల్లా పేరులోంచి వైఎస్సార్ పేరును తొలగించేయడానికి కుట్ర జరుగుతున్నదని గోల చేస్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ పేరు జోడించడానికి తెలుగుదేశం కూడా అభ్యంతరం చెప్పలేదు. అలాగని ఇప్పుడు కూడా సత్యకుమార్ ఆ పేరు తీసేయాలనడం లేదు. కడప అనే పదం లేకపోవడం తప్పు అని మాత్రమే అంటున్నారు. ఆ సంగతి అర్థం చేసుకోకుండా రవీంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories