ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మారిస్తే తప్ప.. అధికార్ల నియామకాలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా కనిపించడం లేదు. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు అక్షింతలు వేస్తున్నప్పటికీ.. సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పటికీ.. తాము ఇచ్చే నివేదిక లోంచి ఒక పేరును ఎంపిక చేయాల్సిందే తప్ప.. వారు ఇంకేం చేయగలరు అనే నిర్లక్ష్య ధోరణి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిలో కనిపిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాత.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నట్టుగా వ్యవహరించిన అనేక మంది అధికారుల మీద ఈసీ వేటు వేసింది. వారి స్థానంలో కొత్తగా జరిగిన నియామకాలు కూడా చాలా వరకు వివాదాస్పదమే అయ్యాయి. తమాషా ఏంటంటే.. ఒక వైసీపీ భక్తుడిని పక్కకు తప్పించి.. ఆ స్థానంలో మరొకరిని నియమించడానికి పేర్లు సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరుతుంది. ప్రతిసారీ కూడా.. ఒక తొలగించబడిన ఒక భక్తుడి స్థానంలో ముగ్గురు భక్తుల పేర్లను సిఫారసు చేయడమే అలవాటుగా చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తూ వచ్చారనే అభిప్రాయం ప్రజల్లో సర్వత్రా వినిపించింది.
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేకపోయిన ఉన్నతాధికారులవైఖరితో విసిగిపోయిన ఈసీ డీజీపీ, సీఎస్ ఇద్దరినీ నేరుగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పిలిపించి మాట్లాడింది. ఈసీతో భేటీ తర్వాత.. ప్రధాన ద్వారం నుంచి వెలుపలికి రాకుండా, మీడియాతో మాట్లాడకుండా, ఆ ఇద్దరూ వెనుకదారినుంచి వెళ్లిపోయారు. అదేరోజు ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టరుపై వేటు పడింది. మరురోజు వారిస్థానంలో కొత్త నియామకాలు కూడా జరిగాయి. అయితే ట్విస్టు ఏంటంటే.. ముగ్గురు ఎస్పీల పునర్నియామకంలో కూడా ఇద్దరు జగన్ భక్తులే అని ఇప్పుడు వినిపిస్తోంది.
చీఫ్ సెక్రటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఎవరిని తొలగించినా సరే.. వారి స్థానంలో నియామకం కోసం మళ్లీ వైసీపీ భక్తులనే ఎంపిక చేసి పంపుతున్నారనే ప్రచారం ఉంది. చీఫ్ సెక్రటరీని ముందు ఆ పదవినుంచి తొలగిస్తే తప్ప.. రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారంలో కూడా న్యాయం జరగదనే వాదన కూడా ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. స్ట్రాంగ్ రూముల రక్షణ కూడా ప్రశ్నార్థకమే అనే భయం వారిలో వ్యక్తం అవుతోంది. కొత్తగా నియమితులైన ముగ్గురు ఎస్పీల్లో.. అనంతపురానికి ఎస్పీగా వచ్చిన గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా నియమితులైన హర్షవర్దన్ రాజు ఇద్దరూ జగన్ భక్తులే అని ప్రచారం ఉంది. పల్నాడు ఎస్పీగా నియమితులైన మలికా గార్గ్ మాత్రం కాస్త స్వచ్ఛమైన ట్రాక్ రికార్డుతో పదవి స్వీకరించారు. మరి ఈ అధికారులైనా నిష్పాక్షికంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.