రోజురోజుకూ పెరుగుతున్న భక్తజనసందోహంతో.. తిరుమల గిరులు కిటకిటలాడిపోతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తిరుమలలో అసలు రద్దీ లేని సీజను ఉండనే ఉన్నదన్నట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. తిరుమలలో ఎన్ని కొత్త కాటేజీలు, కాంప్లెక్సులు అందుబాటులోకి తెస్తున్నప్పటికీ.. వేలమంది భక్తులు రోడ్లమీదనే బసచేయాల్సి రావడం, వీఐనీలకు కూడా గదులు దొరకని పరిస్థితి వంటి ఏర్పడుతున్నాయి. ఈ రకంగా తిరుమల మీద నానాటికీ పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు టీటీడీ యాజమాన్యం భేషైన నిర్ణయం తీసుకుంది. పదివేల విరాళం ఇచ్చిన వారికి వీఐపీ టికెట్ కేటాయించే శ్రీవాణి టికెట్ల కోటాను 500 వరకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. దీనివలన.. వీఐపీలు తీసుకునే స్థాయి గెస్ట్‌హవుస్‌లపై ప్రతిరోజూ కనీసం వంద గదులకుపైగా ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 మందికి టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ సంఖ్యను ఇకపై 2000కు పెంచారు. తిరుమలలో విక్రయించే ఈ శ్రీవాణి టికెట్లకు, ఎయిర్ పోర్టులో విక్రయించే 400 టికెట్లు అదనం. అయితే శ్రీవాణి టికెట్లు కొంటున్న వారికి మరురోజు ఉదయానికి దర్శనం కేటాయిస్తుండడం వలన.. వారందరికీ గదులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఇలా కాటేజీలు అందుబాటులోకి తేవడం టీటీడీకి తలకు మించిన భారం అవుతోంది. ఇప్పుడు శ్రీవాణి టికెట్ల కోటాను పెంచడం వలన ప్రధానంగా ఒక లాభం జరుగుతుంది. వీఐపీ దర్శనాల కోసం సిఫారసు ఉత్తరాలు ఇచ్చేవారిపై ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిజంగానే వీఐపీ స్థాయి వారే అయితే గనుక.. వారిని శ్రీవాణి ద్వారా వెళ్లవచ్చునని చెప్పడం సులువు అవుతుంది. ఆ రకంగా సామాన్య భక్తులకు దర్శనానికి రోజులో కొంత ఎక్కువ సమయం దక్కే అవకాశం ఉంది.
అదే సమయంలో శ్రీవాణి టికెట్లు పొందిన వారికి ఇదివరలా మరురోజు ఉదయం దర్శనం మాత్రమే కాకుండా.. అదేరోజు సాయంత్రం కూడా దర్శనావకాశం కల్పించేలా వేళలు నిర్ణయించారు. ఇది చాలా మేలు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున వెచ్చించి దర్శనం పొందే వీఐపీ భక్తులు.. అవకాశం ఉంటే దర్శనానంతరం వెంటనే తిరిగి వెళ్లిపోవడానికి ఇష్టపడతారు. అలాంటి వారు సాయంత్రం దర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతారు. వారందరికీ గదులు కేటాయించాల్సిన ఒత్తిడి తగ్గుతుంది. ఆ దామాషా మేరకు ఇతర భక్తులకు గదులు దొరుకుతాయి.
మొత్తానికి తిరుమల గిరులపై ఒత్తిడి తగ్గించే సదుద్దేశంతో టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నట్టుగా ఉంది.