భూమనది ఖచ్చితంగా దైవద్రోహమే!

తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్టుగా సాక్ష్యాలతో సహా తేలినతర్వాత.. పాలకపక్షం విమర్శలు చేస్తే.. తిరుమల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని గగ్గోలు పెట్టారు. తిరుమల పవిత్రతకు విఘాతం కలిగిస్తున్నారని ఏడ్చారు. అయితే ఇప్పుడు మాజీ టీటీడీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు పేలుతూ.. టీటీడీని భ్రష్టు పట్టించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన వద్ద కించిత్తు ఆధారం లేదు.. కానీ.. మూడు నెలల్లో వంద గోవులు టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో చనిపోతున్నాయంటూ భూమన కరుణాకరరెడ్డి నిందలు వేయడం ఖచ్చితంగా దైవద్రోహమే అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

తమాషా ఏంటంటే.. భూమన కరుణాకరరెడ్డి ఎలాంటి సంకుచిత బుద్ధులతో, వక్రఆలోచనలతో, కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిందలు వేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలిసిపోతూ ఉంది. గోవుల గురించి తెలియని డీఎఫ్ఓ స్థాయి అటవీశాఖ అధికారిని గోశాల సంరక్షకుడిగా నియమిస్తే వాటికి ఎలా రక్షణ లభిస్తుంది..? అని ప్రశ్నించడం ద్వారా భూమన కరుణాకర రెడ్డి తన అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. డీఎఫ్ఓ కు గోవుల గురించి తెలుస్తుందో లేదో చెప్పగల ఏ అర్హత తనకు ఉన్నది గనుక.. భూమన ఇలాంటి విమర్శలు చేస్తున్నారు? అనేది ఇక్కడ కీలకాంశం. డీఎఫ్ఓ అంటే.. అడవిలోని సమస్త జంతుజాలాన్ని కాపాడే పదవి.. అలాంటి వ్యక్తికి ఒక్క గోశాలనిర్వహణ కూడా చేతకాకుండా ఉంటుందా? ఆయన గోశాల అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూస్తారు తప్ప అందులోని గోవుల బాధ్యతలకు విడివిడిగా ఉద్యోగులు ఉంటారు కదా అనేది ప్రజల సందేహం. ఇలాంటి చవకబారు నిందల ద్వారా.. తను దుర్బుద్ధితోనే ఆవులు చనిపోతున్నాయనే అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నట్టుగా భూమన దొరికిపోతున్నారు.

దీని వెనుక ఒక మర్మం కూడా ఉంది. గతంలో గోశాల డైరక్టరుగా ఉన్న హరినాథ రెడ్డిని వైకుంఠఏకాదశి సందర్భంగా టికెట్ల కేటాయింపు వద్ద విధులకు నియమించారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటకు ఆయనను కూడా ఒక బాధ్యుడిగా భావించి సస్పెండ్ చేశారు. ఆయన వైసీపీకి అనుకూల వ్యక్తి. తనను సస్పెండ్ చేశారు గనుక.. తను వెలగబెట్టిన పదవిలో మరో వ్యక్తి ఉండడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు సమాచారం అందించి.. భూమన ద్వారా ఇలాంటి నిందలు వేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
భూమన ఆరోపణలు అవాస్తవం అంటూ టీటీడీ ఖండిచింది. చనిపోయిన ఆవుల తప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అవి గోశాలలో మృతిచెందినట్టుగాప్రచారం చేస్తున్నారని టీటీడీ పేర్కొంది. టీటీడీ గోశాలలో ప్రస్తుతం 2668 గోవులు ఉన్నాయని, అనారోగ్యం, వృద్ధాప్యం వలన ప్రతినెలా దాదాపు 12-15 గోవులు మరణిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చరాంప్రసాద్ మాట్లాడుతూ.. గోశాలలో ఇటీవల ఒక్క పుంగనూరు ఆవు మాత్రమే చనిపోయిందని.. వంద చనిపోయినట్టుగా భూమన చెప్పడం ఘోరం అని అంటున్నారు. సరైన వివరాలుగానీ, ఆధారాలు గానీ లేకుండా, తప్పుడు ఫోటోలతో టీటీడీ నిర్వహిస్తున్న గోశాల మీద నీలాపనిందలు వేయడం భూమన చేస్తున్న దైవద్రోహం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories