నారాయణుని ‘సేవ’కు కొత్త నిర్వచనాలు ఇస్తున్న టీటీడీ!

‘మానవసేవే మాధవసేవ’ అంటారు పెద్దలు. నరుడికి సేవ చేయడమే నారాయణుడికి సేవ చేయడం అనిపించుకుంటుందని సూత్రీకరిస్తారు. ఆ రకంగా నారాయణునికి సేవ చేయడంలో సరికొత్త నిర్వచనాలను తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం ఆచరణలోకి తీసుకు వస్తున్నది. ఇప్పటికే శ్రీవారి సేవ పేరుతో దేశవ్యాప్తంగా ఉండే వాలంటీర్ల సేవలను తిరుమలలో భక్తులకు సేవ చేయడంలో వినియోగిస్తున్నారు. ఈ పథకానికి స్పందన చాలా అద్భుతంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది శ్రీవారి సేవ రూపంలో తిరుమలలో భక్తులకు సేవ చేయడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో శ్రీవారి సేవను మరిన్ని విభాగాల్లోకి విస్తరింప చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం నిర్ణయించింది.
ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చైర్మన్ బి ఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో ఉండే టీటీడీ ఆసుపత్రులలో కూడా శ్రీవారి సేవకుల సేవలను వాడుకుంటాం అని అంటున్నారు. తిరుపతిలో బర్డ్, స్విమ్స్ తదితర ఆసుపత్రులు అనేకం టిటిడి నిర్వహణలో ఉన్నాయి. ఇక్కడ రోగులకు సేవలు అందించేందుకు కూడా శ్రీవారి సేవకులను వినియోగించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా శ్రీవారి సేవ కింద రిజిస్టర్ అయిన వారి సేవలను తిరుమలలో వివిధ విభాగాలలో వాడుకుంటున్నారు. జన సమ్మంము ఉండే చోట్ల, నిత్యాన్నదాన సత్రంలో వడ్డనలు దగ్గర నుంచి తిరుమలేశుని ఆలయంలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ వరకు వివిధ చోట్ల శ్రీవారి సేవకుల సేవలు ఉపయోగపడుతున్నాయి.

అదే క్రమంలో వీరి సేవలను తిరుపతిలో స్విమ్స్ వంటి ఆసుపత్రులలో కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మానవసేవ మాధవసేవ అనేది నిజమే. అయితే రోగ పీడితులైన గత్యంతరం లేని నిరుపేదలకు చేసే సేవలు నారాయణుడికి మరింత ప్రీతిపాత్రమైన సేవలుగా గుర్తింపు తెచ్చుకుంటాయి. ఆ మేరకు టీటీడీ నిర్ణయం పట్ల భక్తకోటిలో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయం వలన శ్రీవారి సేవ కోసం రిజిస్టర్ చేసుకుంటున్న వారిలో మరింత ఎక్కువమందికి సేవలందించే అవకాశం వస్తుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories