వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాల పేరుతో పెన్షను డబ్బులను పంపిణీ చేయడం మాత్రమే కాదు.. వారిద్వారా జగన్మోహన్ రెడ్డికి అనుకూల ప్రచారం చేయించుకోవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ఆశలు పెంచుకుంది. అంతే కాదు.. జగన్ మళ్లీ గెలవకపోతే మీకు పెన్షన్లు కూడా రావు.. అంటూ ముసలివాళ్లను బెదిరించాలని కూడా అనుకుంది. ఇంకా అనేక రకాల వక్రప్రయోజనాలను ఆశిస్తూ, వక్రవ్యూహాలకు తెరతీస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లకు అదనంగా తాయిలాలు.. భారీగా నగదు ముట్టజెప్పి లోబరచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే.. కోడ్ అమల్లో ఉన్న ఈ రెండు నెలల వ్యవధిలో సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చేరవేయడానికి వాలంటీర్లను వాడుకోకూడదంటూ కేంద్ర ఎన్నికలసంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీకి భయం పుట్టిస్తోంది. వారిద్వారా ఎన్నెన్నో సాధించవచ్చునని ఊహించుకుంటే.. ఇప్పుడు ఈసీ వేసిన బ్రేక్ వల్ల అదంతా సాధ్యం కాదని విషాదం అలముకుంది.
జగన్ చాలా ముందు చూపుతో తీసుకువచ్చిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. వీరిద్వారా ఇంటింటికీ డబ్బులు అందజేస్తున్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఒకరు వంతున వాలంటీర్లు నిత్యం ఆ ప్రజలతో టచ్ లో ఉండేలా చూస్తున్నారు. వీరిని వాడుకుంటూ ఎన్నికల్లో మానిప్యులేషన్ చేయవచ్చుననేది, నియామకం సమయంలోనే ఆయన దూరాలోచన. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లతో సమావేశాలు, శిక్షణలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ వాలంటీర్లంటే అందరూ మన పార్టీ కార్యకర్తలే, జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి మనమంతా కష్టపడి పనిచేయాలి అంటూ.. నాయకులు ఊదరగొడుతుండేవారు.
ఎన్నికలు దగ్గరపడిన తర్వాత.. పార్టీ అభ్యర్థులు అందరూ వాలంటీర్లను పోగేసి వారి భారీగా తాయిలాలు, నగదు కానుకలు ఇచ్చి.. తమకు అనుకూలంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెప్పాలంటూ కోరుతూ వస్తున్నారు.
వాలంటీర్లు ఎటూ డబ్బుతో.. అన్ని ఇళ్లూ తిరుగుతూ ఉంటారు గనుక.. జూన్ మొదటి వారంలో పేద ప్రజల ఓట్లను కొనుగోలు చేయడానికి పార్టీ డబ్బులను కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ చేరవేయవచ్చునని.. అభ్యర్థులు రకరకాలుగా ప్లాన్ చేశారు. ఇలాంటి కుట్రలను ఊహించి.. వాలంటీర్లను ఎన్నికలకు దూరంపెట్టాలని, కోడ్ సమయంలో పథకాల అమలులో వారి పాత్ర లేకుండా చేయాలని విపక్షాలు కోరుతూ వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా ఈసీకి ఈ మేరకు లేఖ రాశారు. వాలంటీర్ల వల్ల వాటిల్లే విపరిణామాలను ఆయన వివరించారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్ల ద్వారా పథకాల అమలు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులకు డబ్బు పంపిణీ గురించి అనువైన మార్గం చేజారిందని భయం పుట్టినట్టు ప్రజలు అనుకుంటున్నారు.