అంతే మరి. వాస్తవాలు మాట్లాడుతున్నాం అని రొమ్ము విరుచుకుని చెప్పేవాళ్లలో మెజారిటీ.. ఏ ఎండకాగొడుగు పట్టేవాళ్లే ఉంటారు. ఏ రోటికాడ ఆ పాట పాడేవాళ్లే ఉంటారు. మీడియా సంస్థలు కూడా అంతే. ఎవరు రూలింగ్ లో ఉంటే.. వారి భజన చేయడానికే ఫోకస్ పెడుతుంటారు. అధికారంలో ఉన్న వారిని ఆశ్రయించి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారగానే.. మీడియా సంస్థలు కూడా రూటమారుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అందరి సంగతీ పక్కన పెడితే.. జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత ఛానెల్ సాక్షి కూడా ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ లను లైవ్ ఇస్తోంది.
ఇలా రూటు మార్చడం అనేది సాక్షికే తప్పకుండా పోయిన తర్వాత.. మిగిలిన చిన్నా సన్నా మీడియా సంస్థల సంగతి ఏముంటుంది. అయితే.. తెలుగులో టాప్ తెలుగు వెబ్‌సైట్ ఒకటి హఠాత్తుగా రూటు మార్చింది ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా చంద్రబాబునాయుడు భజన సాగిస్తోంది.
కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని భజన చేయడం ద్వారా అత్యంత పాపులర్ అయిన టాప్ తెలుగు వెబ్ సైట్ ఒకటి ఉంది. విషయం ఏదైనా సరే.. దానిని జగన్ కు అనుకూలంగా మలచి ప్రచారంలో పెట్టడంలో వారు తమ జగన్ భక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ ఎన్నికల సందర్భంగా కూడా.. చంద్రబాబునాయుడును గానీ.. పవన్ కల్యాణ్ ను గానీ ఎన్ని రకాలుగా బద్నాం చేయవచ్చునో అన్ని రకాలుగానూ బద్నాం చేశారు.
దినపత్రికలతో దీటుగా పేజీవ్యూస్ ఉంటే టాప్ రేంజ్ వెబ్ సైట్ అది. జగన్ పార్టీకి తాము పెద్ద అండగా భావించే సైట్. అలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం తెలుగుదేశానికి అనుకూలంగా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంతే కాదు.. జగన్మోహన్ రెడ్డి పార్టీని మట్టి కరిపించారు. దీంతో నెమ్మదిగా ఆ వెబ్ సైట్ కూడా తమ స్టాండ్ మారుస్తోంది. జగన్మోహన్ రెడ్డి లోపాలను ఎత్తి చూపిస్తున్నాం అంటూ.. ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదని జగన్ అంటే.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇవే అంటూ కథనాలు ఇస్తోంది. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు పాజిటివ్ వార్తలు ఇస్తోంది. ఇన్నాళ్లు చేసిన ప్రచారానికి.. చంద్రబాబు గద్దెనెక్కగానే తమమీద కన్నెర్ర చేయకుండా వారు జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది.