తెలుగు ప్రజలు కలలు కంటున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రింబగళ్లు తేడా లేకుండా.. మూడుషిఫ్టుల్లో కొన్ని నిర్మాణ పనులు నడుస్తున్నాయి. వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షలను కూడా నిర్వహిస్తున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మొత్తం 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయని చంద్రబాబునాయుడు తెలిపారు. 50,552 కోట్ల విలువైన పనులు ఆల్రెడీ టెండర్లు పిలవడం పూర్తయింది. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు మాత్రమే కాదు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలను కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టనున్నారు. రోడ్లు, డక్ట్ లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టారు. మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తయితే.. అమరావతి ప్రాంతంలో ప్రెవేటు నిర్మాణాలు కూడా ముమ్మరంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును తన పాలనకు టాప్ ప్రయారిటీగా తీసుకున్నారు. అమరావతి కి సంబంధించి లాండ్ పూలింగ్, అనుమతులు, డిజైన్లు సిద్ధం చేయించడం వంటి పనులు జరుగుతూ ఉన్న సమయంలో ఆయన ‘ప్రతి సోమవారం.. పోలవారం’ అనే నినాదంతో.. పోలవరం ప్రాజెక్టు పనులపై రెగులర్ గా సమీక్షలు నిర్వహిస్తూ పనులు పరుగులు తీయించారు. లైవ్ సమావేశాల్లోంచి డ్రోన్ వీడియోల ద్వారా పోలవరం లో పనులను లైవ్ లోనే చూస్తూ, వాటిని సమీక్షిస్తూ చంద్రబాబు నాయుడు అధికార్లతో, ఇంజినీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అన్ని రకాలుగా పరుగులు పెట్టించినందువల్లనే.. పోలవరం చంద్రబాబు తొలివిడత పాలనలోనే 70-80 శాతం పూర్తయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు పనులను తన సొంత మనుషులకు అప్పగించుకోవడం ఒక్కటే ప్రధానంగా భావించి విస్మిరించడంతో పనులు తీసికట్టుగా తయారయ్యాయి.
అప్పట్లో పోలవరం మీద ఎంత శ్రద్ధ పెట్టారో.. అంతకంటె ఎక్కువ శ్రద్ధతో అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఈ విడతలో చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81317 కోట్ల మేర పనులను సీఆర్డీయే ప్రతిపాదించినట్టు ఆయన చెబుతున్నారు. తరచూ సమీక్షలతో అనుకున్న గడువు కొద్దిగా మీరినప్పటికీ.. ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా అమరావతి రాజధాని నిర్మాణాలకు ఒక నిర్దిష్టమైన రూపు వస్తుందని మౌలిక వసతులు చాలా వరకు పూర్తవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.