పాపం వైసిపి… మాట్లాడడానికి మనుషులు లేరు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. ఆ పార్టీ తరఫున ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తిట్టడానికి సరైన నాయకుల కొరత కనిపిస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కూర్చుని అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీద అడ్డగోలుగా విమర్శలు చేయడానికి అందుబాటులో నాయకులు తక్కువైపోయారు. అంతో ఇంతో కాస్త మాట్లాడే అలవాటు ఉన్న కొందరు నాయకులు, పోలీసు కేసుల కారణంగా ప్రస్తుతం పరారీలో ఉండడంతో.. కొత్తవారి కోసం దేవులాడవలసిన కష్టం పార్టీకి ఏర్పడింది.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి తెగించి విధ్వంసం సృష్టించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, జోగి రమేష్ తదితరుల మీద కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు, అరదండాలు ఖాయం అని గ్రహించిన ఈ నాయకులు ముందు జాగ్రత్తగా మేలుకొని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే వారి కోరికను మన్నించడానికి హైకోర్టు నిరాకరించింది. పైగా కేసులు రెండేళ్ల కిందట నమోదు కాగా అప్పటి పోలీసులు పట్టించుకోకపోవడం అనేది ప్రభుత్వం యొక్క దుశ్చర్య అన్నట్లుగా హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న వారి కోరికను కూడా హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఐదుగురు కీలక నాయకులు ఒక్కసారిగా పరారయ్యారు. హైదరాబాద్ శివారులలో తలదాచుకున్న నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చి ప్రస్తుతానికి రిమాండ్ లో ఉంచారు. మిగిలిన వారి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. వీరిలో లేళ్ళ అప్పిరెడ్డి, జోగి రమేష్, నందిగం సురేష్ వంటి వారు అతి తరచుగా తాడేపల్లి ఆఫీస్ నుంచి ప్రెస్మీట్లు పెట్టడంలో సిద్ధహస్తులు. ఇప్పుడు వారెవ్వరూ లేరు. చంద్రబాబును తిట్టించడానికి కొత్త నాయకుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సి వస్తుంది. విజయవాడలో వరద ముప్పు చోటు చేసుకుంటే ఎక్కడో కాకినాడ నుంచి మాజీ మంత్రి కన్నబాబుని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించారు. మల్లాది విష్ణు అర్థంపర్థం లేకుండా కొన్ని విమర్శలు. చేశారు విజయవాడకే చెందిన మరికొందరు సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టాలని పార్టీ కార్యాలయం నుంచి ఫోను వస్తే, మొహం చాటేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గతిలేక ఇతర నాయకులను వాడుకోవాల్సి వస్తుంది. పాపం వరదల్లో ప్రజలు ఒక రకం కష్టాలు అనుభవిస్తుండా ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి కష్టాలు వచ్చాయి రా దేవుడా అని ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories