విజయసాయిరెడ్డి పరిస్థితి చూస్తోంటే జాలి కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నప్పుడు, రాజ్యం చేస్తున్న జగనన్న అండ చూసుకుని చెలరేగిపోయిన పాపాలు అంతరంగాన్ని వెంటాడుతుండగా ఆయన మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తన రాజ్యసభ పదవికి, జగన్మోహన్ రెడ్డితో అనుబంధానికి కూడా తిలోదకాలు ఇచ్చేసి.. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. కానీ బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా అప్పటి పాపాలు ఆయనను ఇంకా వెన్నాడుతున్నాయి. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ లలో వాటాలు దక్కించుకోవడానికి విజయసాయి సారథ్యంలో ఎంతటి దందాల మంత్రాంగం నడిపారో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అప్పుడు నష్టపోయిన వారు ధైర్యం చేసి కేసులు పెట్టడంతో.. దందాలతో దక్కించుకున్న వాటాలను తిరిగి వదిలించుకున్నారు. కానీ.. ఆ పాపానికి సంబంధించిన కేసులు మాత్రం విడిచిపెట్టడం లేదు.
కాకినాడ సీపోర్టు, సెజ్ ల యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి రూ.3600 కోట్ల విలువైన వాటాలను వైకాపా నేతలు దక్కించుకున్న వ్యవహారంలో విజయసాయి ఏ2 నిందితుడు. టీటీడీ ఛైర్మన్ గానూ చేసిన ప్రస్తుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఈ దందాలో ఏ 1గా ఉన్నారు. ఈ వాటాల కొనుగోలు వ్యవహారంలో బెదిరింపులు జరిగినట్టుగా సీఐడీ కేసులు నమోదు చేయగా, ఈ కొనుగోలు లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగినట్టుగా గుర్తించిన ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. విజయసాయి ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఈడీ విచారణకు హాజరయ్యారు.
అయితే వాటాలకోసం బెదిరింపుల వ్యవహారం ప్రస్తావించినప్పుడు.. అసలు తనకు సీఐడీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన చాలా డాంబికంగా సెలవిచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం కూడా పూర్తయింది. ఆయన అందుబాటులో లేనందున ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. ఆయన బుధవారం సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
విజయసాయి పాపాలు ఇక్కడితో ఆగిపోవడం లేదు. గతంలో చేసిన అరాచకాలు, దందాలు మాత్రమే కాదు… తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి తన సారథ్యంల చేసిన కుట్రలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
2019లో కోడెల శివప్రసాదరావు, ఆయన కొడుకు శివరామకృష్ణల మీద నరసరావుపేట టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఒక చీటింగ్ కేసు నమోదు అయింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజు ఈ కేసు పెట్టారు. అయితే కేవలం విజయసాయి సూచనల మేరకు మాత్రమే ఈ కేసు పెట్టినట్టుగా ఇప్పుడు ఆ నాగరాజు సెలవిస్తున్నారు. దీంతో విజయసాయి అకృత్యాలు మరింతగా బయటకు వస్తున్నాయి. త్వరలోనే విజయసాయి అరెస్టు కూడా జరగవచ్చునని పలువురు భావిస్తున్నారు.