తనకు ఉన్న తెలివితేటలు అపారమైనవి అనే నమ్మకంతో.. కన్నూమిన్నూ కానకుండా చేసిన కుట్రలు.. సాధారణమైనవి కావని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈపాటికి అర్థమయ్యే ఉండాలి. అనారోగ్య కారణాలు చూపించినా, ఆల్రెడీ కస్టడీ విచారణ కూడా పూర్తయిందని నివేదించినా ఫలితం దక్కడం లేదు. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ లను పట్టించుకోవడం లేదు. అటు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ను కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు చేసిన దురాగతాల మీద వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయా నాయకులందరూ కూడా ఏదో తమకు తోచిన రీతిలో న్యాయవాదులను నియమించుకొని, వాటిని చట్టపరంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీలో ఏ నాయకుడికీ రానటువంటి విచిత్రమైన ఆలోచన వచ్చింది. తాను గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద అనుచరులతో దాడి చేయించినట్లుగా పోలీసు కేసు పెట్టిన టిడిపి పార్టీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి అతడిని బెదిరించి అతడి ద్వారానే ఎస్సీ ఎస్టీ కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. తద్వారా తన మీద పెట్టిన దాడి కేసు పూర్తిగా నీరుగారి పోతుందని వంశీ భావించారు. తాను ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తలచిందని అన్నట్లుగా ఆయన అంచనాలు తారుమారు అయ్యాయి. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకుతోడు దళిత యువకుడు సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి నట్లుగా కొత్త కేసు కూడా మెడకు చుట్టుకుంది. ఎన్ని రకాలుగా బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఈ విషయంలో పోలీసులు చాలా పక్కా ఆధారాలు సేకరించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రాలేకపోయారు.
రెండు రోజుల కిందట పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో తనకు బెయిలు కావాలని కోరిన వంశీ విజ్ఞప్తిని సిఐడి కోర్టు తిరస్కరించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకొని పోలీసులు విచారించినందున ఇక బెయిలు మంజూరు చేయవచ్చునని అతని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే బాధితుడు తరఫు న్యాయవాదులు మాత్రం వంశీకి బెయిలు మంజూరు చేస్తే సత్యవర్ధన్ కు ప్రాణహాని ఉంటుందని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన కిడ్నాప్ చేయడం, తన ఇంటిలో నిర్బంధించడం, అతడిని బెదిరించడం ఇవన్నీ సాంకేతిక ఆధారాలతో సహా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో బాధితుడి పక్షాన న్యాయవాదుల మాటకు న్యాయస్థానం విలువ ఇచ్చింది. ఈ కేసులో కూడా ఆయన బెయిలు విజ్ఞప్తిని తిరస్కరించింది. వల్లభనేనివంశీ ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో మరికొన్ని రోజులు పాటు జైలులో, తన కేటాయించిన సింగిల్ బారెక్ లో, ఒంటరిగానే గడపాల్సి ఉంటుంది.