జీవితం అంతే. ఒక తప్పుడు పని చేస్తే.. దాని తాలూకు అపరాధభావం జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది. ఒకతప్పుకే అంతగా భయం పుడుతుందని అనుకుంటున్నప్పుడు.. ప్రతిరోజూ పదేపదే, అనగా వందల వేల తప్పులు చేస్తూ ఉండే వారి పరిస్థితి ఏమిటి? వారికి అనునిత్యం భయమే కదా? ఇప్పుడు సాక్షి చానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అమరావతిని వేశ్యల రాజధాని అని తన లైవ్ షోలో అతిథిద్వారా చెప్పించి.. చేసిన పాపానికి .. తాను కనిపిస్తే చాలు జనం కొడతారని ఆయన భయపడుతూ బతుకుతున్నారు. హైకోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ వేసి.. తన బెయిల్ ఉత్తర్వ్లులో చిన్న సవరణ పొందడమే ఇందుకు నిదర్శనంగా ఉంది.
అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో నమోదు అయిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కీలక నిందితుడు. కాకపోతే ఆయనకు ముందుగా బెయిలు వచ్చింది. పోలీసులు ఈ కేసులో చార్జీషీటు దాఖలు చేసేవరకు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో తుళ్లూరు పోలీసు స్టేషనకు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొమ్మినేనికి తుళ్లూరు దాకా వెళ్లాలంటే ఒంట్లో వణుకు పుడుతున్నట్టుగా ఉంది. తాను చేయించిన వ్యాఖ్యలకు ఆగ్రహంతో మండిపడుతున్న జనం.. రాజధాని అమరావతి నడిబొడ్డున ఉన్న తుళ్లూరు వరకు తాను వెళితే.. తన మీద పడి కొడతారని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే కోర్టుకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. కోర్టు కాస్త సడలింపు ఇచ్చి.. తుళ్లూరు దాకా రానవసరం లేదని, తాడేపల్లి స్టేషనుకు వచ్చి సంతకాలు పెడితే సరిపోతుందని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత చందంగా ఉంది కొమ్మినేని పరిస్థితి. తన లైవ్ షోలో అసందర్భంగా అమరావతి ప్రస్తావన తీసుకువచ్చి.. జర్నలిస్టు కృష్ణంరాజుతో.. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అనే తప్పుడు మాటలు మాట్లాడించిన వ్యక్తి ఈ కొమ్మినేని. ఆ వ్యాఖ్యల తర్వాత వాటిని ఖండించకపోగా.. అలా మాట్లాడితే మీమీద ట్రోలింగ్ చేస్తారేమో.. అంటూ వెకిలినవ్వులతో కూడిన సానుభూతిని జర్నలిస్టు కృష్ణంరాజు మీద చూపించిన వ్యక్తి ఆయన. తీరా ఈ వ్యాఖ్యల వివాదం నానా రచ్చా అయిన తర్వాత.. పోలీసు కేసులు నమోదు అయ్యాక, ప్రజలు సాక్షికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా ప్రారంభించిన తర్వాత.. కొమ్మినేని శ్రీనివాసరావు.. తన వైఎస్ భారతికి, వైఎస్ జగన్ కు క్షమాపణ చెప్పారే తప్ప తన తప్పు తెలుసుకుని, మనస్తాపం చెందిన అమరావతి ప్రజలకు ఆయన పొరబాటున కూడా క్షమాపణ చెప్పలేదు. ఈ పాపాలన్నింటికీ కలిపి.. ఇప్పుడు ఆయన పోలీసుస్టేషనుకు వెళ్లి సంతకాలు పెట్టడానికి కూడా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. అయినా.. ఆయన ఏదో యాగీ చేయాలని చూస్తున్నారు తప్ప.. ప్రజలు నిజంగా ఆయనను కొట్టాలనుకుంటే గనుక.. హైదరాబాదు వచ్చి కొట్టలేరా? అని జనం నవ్వుకుంటున్నారు.