పాపం పెద్దిరెడ్డి.. వృద్ధ నారీ పతివ్రతః

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం అభాసుపాలైంది. ఆయన బతుకు వృద్ధనారీ పతివ్రతః అనే సామెత చందంగా తయారైంది. వృద్ధ నారి తప్పు చేయడానికి అవకాశం ఉండదు గనుక.. ఆమె పతివ్రత డైలాగులు చెబితే ఎలా ఉంటుంది.. అందులో కామెడీ యాంగిల్ తప్ప స్ట్రెయిట్ పాయింట్ ఉండదు. ఇప్పుడు పెద్దిరెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబరుగా ఉండడానికి ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడం అంటేనే ఓటింగుకు సిద్ధంగా ఉండాలి. గెలవడానికి సరిపడా బలం తమకు ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. గెలువగలిగినప్పుడు ఎన్నికలను బహిష్కరిస్తే అందులో ఆగ్రహం కనిపిస్తుంది గానీ.. గెలిచే అవకాశమే లేనప్పుడు ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తే అందులో వృద్ధనారీ పతివ్రతః సామెత లాంటి చేతగానితనమే కనిపిస్తుంది. నిన్న నామినేషన్ వేసి.. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరిస్తున్న తీరు గమనిస్తే అందరూ ఆ సామెత గుర్తు చేసుకుంటున్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదు అనేది అందరికీ తెలిసిన సంగతి. ప్రతిపక్షం అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ అనేది సభలో ఒక పార్టీ మాత్రమే. హోదా ఉన్న ప్రతిపక్షం కాదు. పీఏసీ సభ్యుడిగా ఉండాలంటే కూడా కనీసం పది శాతం ఓట్లు గెలుచుకోగలిగిన సత్తా ఉండాలి. ఆ సంగతి తెలిసినప్పటికీ.. పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి తగుదునమ్మా అంటూ నామినేషన్ వేశారు. ఇదంతా అభాసుపాలయ్యే వ్యవహారం అని ఆయనకు ముందే తెలుసేమో గానీ.. నామినేషన్ కు స్వయంగా తాను వెళ్లకుండా తమ్ముడు ద్వారకనాధ్ రెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలతో పంపారు.

పీఏసీ ఛైర్మన్ పదవిని తమకు ఇవ్వలేదని గోల చేయడానికితప్ప.. ఇలా నామినేషన్ వేయడంలో మరొక అంతరార్థం లేదనేది అందరికీ అర్థమైంది. ఆ ఆనవాళ్లు, వారి కోరిక నామినేషన్ కు ముందే కనిపించాయి. వాళ్లు వెళ్లిన సమయానికి నామినేషన్ పత్రాలు తీసుకోవాల్సిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సీట్లో లేకుండా.. అసెంబ్లీలో ఉండడంతో అప్పటికప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నానా రచ్చ చేసేశారు. మండలి నుంచి బొత్స కూడా వచ్చి వారు రచ్చచేయడానికి తన వంతు హెల్ప్ చేశారు. గెలవేం అని తెలిసీ నామినేషన్ వేసి.. తీరా ఇప్పుడు సాంప్రదాయం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. నిన్న నామినేషన్ వేయడానికి స్వయంగా రాలేకపోయిన పెద్దిరెడ్డి, ఇవాళ ఎన్నిక బాయ్ కాట్ ను ప్రకటించడానికి మీడియా ముందుకు రావడం సుద్దులు చెప్పడమే తమాషా!

Related Posts

Comments

spot_img

Recent Stories