పాపం జగన్.. వ్రతం చెడినా ఫలం దక్కలేదే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చూసిన వారికి అయ్యోపాపం అనిపిస్తోంది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. శాసనసభలో అడుగుపెట్టబోయేది లేదని 2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మల్యేగా ప్రమాణం చేసిన నాటినుంచి జగన్ ఢంకాబజాయించి చెబుతూనే ఉన్నారు.  ఎన్నిసార్లు ఆ అంశం ప్రస్తావనకు వచ్చినా.. స్పీకరు సమాధానం చెప్పాలని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన దబాయిస్తూ వచ్చారు.

చాలా కాలం సాగదీసిన తర్వాత.. 60 రోజులు సభకు రాకపోతే.. ఆటోమేటిగ్గా తన సీటు ఖాళీ అయినట్టు ప్రకటించేస్తారని భయపడిన జగన్.. ఏదో ఒకరకంగా బుకాయించుకోవచ్చుననే ఉద్దేశంతో సోమవారం అసెంబ్లీకి వచ్చారు. ఒక్కరోజు వచ్చి.. 60 రోజుల ఆబ్సెంట్ రిమార్క్ పడకుండా  చూసుకుని తర్వాత పారిపోదాం అనుకున్నారు. పదినిమిషాలు సభలో కూర్చుని వెళ్లిపోయారు. హమ్మయ్య- ఇక పదవికి ఢోకా లేదు అనుకుని.. ఇంటికి వెళ్లి పార్టీ ఎమ్మెల్యేల్నందరినీ కూర్చోబెట్టుకుని.. రేపటినుంచి మళ్లీ సభకు వెళ్లకూడదని, ప్రతిపక్ష హోదా కోసం తమ నిరసన తెలియజేయాలని చాలా ఘనంగా ప్రకటించారు.

ఈలోగా శాసనసభ వర్గాలు మాత్రం జగన్ కు గట్టి షాక్ ఇచ్చాయి. గవర్నరు ప్రసంగం జరిగిన సోమవారం నాటి శాసనసభ- సమావేశాల వర్కింగ్ డేస్ కిందికి లెక్కలోకి రాదని, ఈరోజు హాజరు కావడం అనేది 60 రోజుల హాజరు పరిధిలోకి రాదని, స్పీకరు అధ్యక్షతన జరిగే సభ మాత్రమే వర్కింగ్ డే అవుతుందని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఇప్పుడు ఆయన పదవి కాపాడుకోవాలంటే.. మంగళవారం కూడా సభకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే పదవి దక్కుతుందేమో గానీ.. పరువు మాత్రం పోతుంది.

తాను సభకు హాజరు కాబోయేది లేదని.. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని ప్రగల్భాలు పలికారో లెక్కలేదు. నిజానికి అవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలే. కేవలం ఎమ్మెల్యే పదవి కూడా పోతుందనే భయంతోనే ఆయన తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. ఇక చాల్లే అని కూడా అనుకున్నారు. పదినిమిషాలకు ఇంటికెళ్లిపోయి.. రేపటినుంచి రాబోము అనికూడా ప్రకటించారు. ఆ తర్వాత చావు కబురు చల్లగా అసెంబ్లీ అధికారులు ప్రకటించారు.

ఇవాళ్టి సభ కేవలం కస్టమరీ డే- అనగా సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన సభ మాత్రమేనని, దీనిని శాసనసభ వర్కింగ్ డే కింద పరిగణించబోం అని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి. పాపం జగన్ ప్రగల్భాలు పలికిన వ్రతం చెడింది.. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆయన మరొకరోజు అనగా మంగళవారం కూడా సభకు రావాలి. వస్తే పదవి దక్కుతుంది.. కానీ.. పదవికోసం కక్కుర్తి పడి దిగజారి వ్యవహరిస్తున్నారని.. ప్రజలు గుర్తిస్తారు.. పరువుపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories