‘మసిగుడ్డ కాల్చి మొహాన పడేయడం వరకే మన పని.. ఆ తర్వాత.. మొహానికి అంటిన మసిని కడుక్కోవడం అనేది అవతలి వాళ్ల ఖర్మ’ అన్నట్టుగానే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానాలకు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. ఆయన ఏదో కొన్ని చచ్చి పడి ఉన్న ఆవుల ఫోటోలను చూపించి.. గత మూడు నెలల కాలంలో.. టీటీడీ నిర్వహిస్తున్న భారీ గోశాలలో వంద గోవులకు పైగా చనిపోయాయని.. ఒక కాకిలెక్కను ప్రకటించి.. ధర్మానికి ద్రోహం జరుగుతోంది, గోవులను చంపేస్తున్నారు.. అంటూ ఆక్రోశించారు.. మొసలి కన్నీరు కార్చారు. అవి తప్పుడు ఫోటోలు అని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ప్రకటించిన వివరాలన్నీ అవాస్తవాలు అంటున్నాయి. అయితే.. ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే.. భూమన కొన్ని ఫోటోలను చూపించిన తరువాత.. ఆ ఫోటోల మూలాలు ఎక్కడున్నాయో సాంకేతికంగా ఛేదించి.. వాటి గురించి నిగ్గుతేల్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోటోల మూలాలను తేల్చడం కోసం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని పోలీసులు విచారించాలని వారు కోరుతున్నారు.
రాజకీయ ప్రత్యర్థుల మీద నిందలు వేసినంత ఆధారరహితంగా టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థ మీద నిందలు వేయడం ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. అదే సంస్థకు గతంలో ఛైర్మన్ గా పలుమార్లు పనిచేసిన అనుభవం ఉన్న భూమన కరుణాకర రెడ్డికి అది తెలియని సంగతి కాదు. వారు తరచూ చెప్పుకునేట్లుగా.. మూడేళ్ల తర్వాత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే గనుక.. భూమనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి వరించవచ్చు కూడా. అలాంటి నాయకుడు.. కాస్త బాధ్యతగా సంస్థ మీద విమర్శలు చేయాలి. ఆయన ఆ పని చేయలేదు.
అందుకే ఆ ఫోటోలు ఫేక్ ఫోటోలు అని టీటీడీ వర్గాలు, ప్రభుత్వంలోని నాయకులు మాటల్లో చెప్పేసి ఊరుకోకూడదు. భూమన కరుణాకర రెడ్డిని విచారించి ఆయనకు ఆ ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకుని.. వాటి డిజిటల్ మూలాలను శోధించి.. ఎప్పుడు? ఎక్కడ? తీశారో కనిపెట్టాలి. ఇవాళ్టి రోజుల్లో హత్యకేసులను సైతం కేవలం సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు సాల్వ్ చేసేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక డిజిటల్ ఫోటో సర్కులేట్ అయినప్పుడు.. సరిగ్గా శోధిస్తే గనుక.. దాని మూలాలను కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఇలాంటి విచారణకు భూమన కూడా సహకరించాలి. గోశాల గురించి తానుచేసిన వ్యాఖ్యలు.. అక్కడి పరిస్థితులను బాగు చేయడం గురించి చిత్తశుద్ధితో చేసి ఉన్నట్లయితే.. ఆ ఫోటోల మూలాల్ని పోలీసులకు తెలియజెప్పాలి. లేకుంటే.. ఆయన రాజకీయ దురుద్దేశంతో డ్రామా ఆడుతున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు.