ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే దూకుడు. మరోవైపు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల భిన్నాభిప్రాయాలు! వీటి మధ్య తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశంలో పుట్టిన అంతర్గత ముసలం కాస్తా.. లోకేష్ జోక్యం, అధిష్ఠానం తరఫు పెద్దల పూనికతో చల్లబడింది. పార్టీ కార్యకర్తలతోనే దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వైఖరిలోనే లోపం ఉన్నదని పార్టీ పెద్దల వద్ద ఒప్పుకున్నారు. నియోజకవర్గం పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని తానే చొరవతీసుకుని చక్కదిద్దుతానని ఆయన పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. అందుకోసం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసుకున్న సమావేశానికి ఎంపీ కేశినేని శివనాధ్, వర్ల రామయ్య కూడా హాజరుకాబోతున్నారు.
ఒక పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పుడు.. నియోజకవర్గాల్లో సుదీర్ఘకాలంగా పార్టీకోసం పనిచేస్తున్న వారు కాకుండా.. కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యాల్లో అసంతృప్తులు రేగడం, టీకప్పులో తుపానులాంటి చిన్నచిన్న విభేదాలు పొడసూపుతూ ఉండడం సహజం. వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళతారనేది పార్టీ పెద్దల మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. నారా లోకేష్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కొలికపూడిని సున్నితంగా హెచ్చరించడం, ఆ తర్వాత సీనియర్ నాయకులు ఆయనతో చర్చించి.. పార్టీని కాపాడుకోవడానికి కార్యకర్తలతో సఖ్యంగా మెలగాల్సిన అవసరాన్ని తెలియజెప్పడంతో ఈ దుమారం చల్లబడినట్టు తెలుస్తోంది.
తిరువూరుఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీద చాలా విమర్శలే వచ్చాయి. అతి స్వల్పకాలంలోనే ఆయన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు చేతకానంత చెడ్డపేరును స్థానికంగా మూటగట్టుకున్నారు. స్థానికంగా విలేకరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎవ్వరితోనూ ఆయన సఖ్యంగా మెలగిన ఉదాహరణలు లేవు. విలేకర్లు కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం జరిగింది. పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్య ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. మహిళలంతా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపుతున్నాడనే చెడ్డపేరు కూడా వచ్చింది. అయితే పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడినప్పుడు.. తన వైఖరి వల్లనే ఈ సంక్షోభం వచ్చిందని, తీరు మార్చుకుంటానని కొలికపూడి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వివాదం పరిష్కారమైంది.