పోరాడే వేళ : వైసీపీకి మరో దెబ్బ పడిందే!

ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలని అనుకుని.. ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నాకు ఉపక్రమించారు. అదే సమయంలో.. ఇక్కడ వైసీపీ భవనం మధ్యలోంచి ఒక ఇటుక జారిపోయింది. ఆ పార్టీ తరఫున గత అయిదేళ్లపాటు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ లాగా కొందరు వ్యక్తుల చేతుల్లో నడిచే పార్టీలో తాను కొనసాగలేను అని ఆయన తేల్చి చెప్పేశారు. అదే గుంటూరు జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే కిలారి రోశయ్య కూడా రాజీనామా చేయడం ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఎన్నికల్లో కిలారి రోశయ్య పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర మీద గెలిచారు. అయితే గత ఎన్నికల సమయంలోనే పార్టీ నేతలు ఆయనను వేధించారనే ప్రచారం ఉంది. ఆ ఎన్నికల్లో ఆస్తులు అమ్మి, తాకట్టు పెట్టి మరీ ఆయన ఎన్నికల ఖర్చులు పెట్టుకున్నారు. విజయం సాధించినప్పటికీ.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి ఉంది.

తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి పొన్నూరు టికెట్ మళ్లీ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. అక్కడైతే గెలిచే అవకాశం లేదు అని చెప్పి.. మరో ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. తొలుత లావు శ్రీకృష్ణ దేవరాయలును గుంటూరు ఎంపీగా అనుకున్నారు. లావు ససేమిరా అని చెప్పి.. తెలుగుదేశంలోకి వెళ్లడంతో కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీగా ఆయనకు ఇష్టం లేకపోయినా పోటీచేయించారు. ఆ రకంగా తనను బలిపశువును చేశారనే అభిప్రాయం ఆయనకు ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్లకు ఆయన పార్టీకి రాజీనామా చేయడం విశేషం.
‘వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. నన్ను మానసికంగా కుంగదీశారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. కొందరు వ్యక్తుల ఇష్టప్రకారమే నడుపుతున్నారు’ అని రోశయ్య ఆరోపణలు చేశారు.
కిలారి రోశయ్య తర మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జనసేనలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వారి చేరికకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగానే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories