ఆవిధంగా చంద్రబాబు టార్చ్ బేరర్ అయిన వేళ..

టార్చ్ బేరర్ అనే పదం ఒకటి ఉంటుంది. తనతో పాటు నడుస్తున్న సమాజానికి ఒక దిశానిర్దేశం చేసేలాగా తొలి అడుగు వేసేవాడిని, కొత్త దారిని తీర్చిదిద్దే వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఆ ప్రమాణాల ప్రకారం చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును గమనించినప్పుడు.. వర్తమాన ప్రపంచానికి ఆయన టార్చ్ బేరర్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. సంపన్నులు కేవలం సంపదను ఆర్జించడం మాత్రమే కాదు.. ఆ సంపదలో కొంతభాగం పేదల కోసం ఇవ్వడాన్ని ఒక కర్తవ్యంగా తెలియజెబుతూ, కార్యక్రమంగా రూపుదిద్దారు చంద్రబాబు. అంతటితో ఆగలేదు. కేవలం ఇలాంటి పనిచేయాల్సిందిగా నలుగురికీ ఉపదేశాలు చేయడం మాత్రమే కాకుండా.. తాను స్వయంగా ఒక మార్గదర్శిగా మారుతానని చెప్పి.. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆ రకంగా తొలిఅడుగు వేసి.. మార్గదర్శిగా ఉండడంలో కూడా సహచర ప్రజాప్రతినిధులకు నాయకులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు బాటను అనేకమంది ఇతర నాయకులు అంది పుచ్చుకుంటున్నారు. తాము కూడా మార్గదర్శులుగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ మేరకు ముందుకు వచ్చారు.

తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో ఎస్టీ వర్గాలకు చెందిన వంద కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. అదే మాదిరిగా జీవీ ఆంజనేయులు కూడా వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టుగా ఆంజనేయులు ప్రకటించారు.

ఇద్దరు ముందుకు రావడం కేవలం ప్రారంభం మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే.. ముందుముందు ఇంకా అనేకమంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా మార్గదర్శులుగా ముందుకు రావడం జరుగుతుందనే అంచనాలు సాగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే.. చంద్రబాబునాయుడు కేవలం మాటలు చెప్పి ఊరుకోవడం లేదు. ఒక మంచి పనిని అందరూ చేయాలని ఆయన ఉపదేశాలు చెప్పి ఊరుకోవడం లేదు. తాను కూడా స్వయంగా ఆచరిస్తున్నారు. 250 కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులు కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటారని పేర్కొన్నారు. అంతటితో కూడా ఊరుకోవడం లేదు. తన చర్య ద్వారా ప్రజాప్రతినిధులకు ఆయన ప్రేరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలతో అందరూ అలాంటి కృషిలో భాగం పంచుకోవడం అనేది మొదలవుతోంది. ఎమ్మెల్యేలు ఇలా ముందుకు రావడం అనేది మిగిలిన ఎమ్మెల్యేలకు ప్రేరణ అవుతుంది. వారు వంద కుటుంబాల వంతున దత్తత తీసుకుంటే.. వారి అనుచరులు, అభిమానుల్లో కొందరు కూడా తమ స్థాయిలో తలా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునేలా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పీ4 ద్వారా.. నలుగురూ మార్గదర్శులుగా ముందుకు వచ్చే విషయంలో చంద్రబాబునాయుడు ఒక టార్చ్ బేరర్ గా తనను తాను ఆవిష్కరించుకున్నారని అనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories