మూడేళ్లే టార్గెట్ : అద్భుతం ఆవిష్కృతం అవుతుందా?

ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ కూటమికి లిట్మస్ టెస్టులాంటి ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణం! ఐదేళ్లపాటు అతీగతీ లేకుండా పోయిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఇప్పుడు శరవేగంతో పూర్తి చేయించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఐకానిక్ భవనాలు తప్ప, ప్రభుత్వం తరఫున నిర్మించే మిగిలిన అన్ని భవనాలకు డిసెంబరు నెలాఖరులోకా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయబోతున్నారు. తాజా అప్ డేట్ ఏంటంటే.. ప్రభుత్వ పరంగా చేపట్టే అన్ని నిర్మాణాలను కూడా.. మూడేళ్ల డెడ్ లైన్ పెట్టుకుని పూర్తిచేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. మూడేళ్ల టార్గెట్ రకరకాల కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతుందని అనుకున్నప్పటికీ.. మరో ఆరునెలలు, ఏడాది గడువు పట్టినప్పటికీ.. నాలుగేళ్ల వ్యవధిలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రజలు కలల రాజధాని అమరావతి కనుల ఎదుటకు రానున్నది.

వచ్చే ఏడాది తొలిభాగంనుంచే అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. పనులు చేపట్టడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా.. గతంలో చంద్రబాబు పాలన కాలంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు పెండింగు బిల్లు బకాయిలు అన్నీ చెల్లించేయాలని నిర్ణయించారు. అప్పటి టెండర్ల గడువు ఎప్పుడో ముగిసిపోయింది. కానీ పనులు పూర్తి కాలేదు. ఆ టెండర్లను క్లోజ్ చేసి పనులకు మళ్లీ ఫ్రెష్ గా టెండర్లు పిలువబోతున్నారు. గతంలో 41 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా, 38 వేల కోట్లకు ఖరారుచేసి పనులు అప్పగించారు. జరిగిన పనులకు 5వేల కోట్ల వరకు చెల్లించారు. మరో 600 కోట్లు బకాయిలున్నాయి. అవి కూడా చెల్లించేసి టెండర్లు క్లోజ్ చేస్తారు. కొత్తగా టెండర్లు పిలుస్తారు. మూడేళ్లే గడువు విధించబోతున్నారు. అంచనా వ్యయం 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ఏదిఏమైనప్పటికీ.. రాబోయే మూడేళ్లలో అమరావతి రాజధాని రూపురేఖలు మొత్తం మారిపోనున్నాయి. ప్రభుత్వభవనాల నిర్మాణం అంతా ఒక దశకు రావడం మొదలైతే.. ప్రెవేటు నిర్మాణాలు కూడా ఊపందుకుంటాయి. యూనివర్సిటీలకు, వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో పనులు వేగం అందుకుంటాయి. దాదాపు 150 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇక్కడ కార్యాలయలకు భూములిచ్చారు. అవన్నీ కూడా ముమ్మరంగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. ఐకానిక్ భవనాలు మరికొంత ఆలస్యం కావొచ్చు గానీ.. నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతిపౌరుడూ గర్వించే రాజధాని రూపుదిద్దుకుంటుందని అంతా ఆశలు పెట్టుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories