వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటి కలలను తీర్చే అద్భుతమైన నాయకుడిని తానేనని చాటుకోవాలనుకున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తానని అన్నారు. ఒక సెంటు ఇంటి స్థలం పేరుతో సెంటిమెంటు ప్లే చేశారు. లక్షల మందికి ఇంటి పట్టాలని ఇచ్చారు. కేవలం ఇంటి స్థలాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని నిధులు ఇస్తుందని ఊదరగొట్టారు. కేంద్రప్రభుత్వ పథకాలను ఇందులో కలిపేశారు. లబ్ధిదారులకు రకరకాల ఆప్షన్లు ఇచ్చారు. వాళ్ళు సొంతంగా నిర్మించుకోవడం ప్రారంభిస్తే ప్రభుత్వం జరిగిన పనులను బట్టి నిధులను విడుదల చేయడం లాంటివి అందులోని ఆప్షన్స్! వాటిలో పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చేలాగా ఆప్షన్ 3 కూడా ఉంది. సహజంగానే చాలామంది పేదలు ఆప్షన్ 3 ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ ముసుగులో అతి పెద్ద దందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపించింది. ఆప్షన్ 3 కింద ప్రభుత్వం ఇచ్చే నిధులతో పేదలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చే బాధ్యతను వైసిపి అనుకూల కాంట్రాక్టర్లకు కట్టబెట్టా.రు ప్రభుత్వం అప్పగించిన పని, తక్కువ నిధులతో ఇల్లు నిర్మించడం, పైగా ఉచితంగా తీసుకునే- ప్రశ్నించడానికి భయపడే పేదల కోసం నిర్మించడం.. ఇవన్నీ కలిపి కాంట్రాక్టర్ల విచ్చలవిడితనానికి దారితీసాయి.
ప్రభుత్వం పేర్కొన్న ప్రమాణాల ప్రకారం కాకుండా.. విచ్చలవిడిగా అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లు ఇళ్లను పూర్తి చేశారు. చాలా చోట్ల ఇళ్లు కూడా పూర్తి కాలేదనేది వేరే సంగతి. అయితే పూర్తయిన ఇళ్లు కూడా కొలతలు, నిర్దిష్ట ప్రమాణాలకు భిన్నంగా ఉండడం ఒక లోపం. నాణ్యత విషయంలో అత్యంత దారుణంగా ఈ ఇళ్లను నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో పనుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించి కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి నివేదికల విషయంలో కూడా మాయ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. చాలా నిధుల విషయంలో కేంద్రానికి నివేదికలు సమర్పించనేలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలో జరిగిన తప్పుల లెక్క తీయడం ప్రారంభమైంది. పేదలకు ఆప్షన్ 3 కింద నిర్మించి ఇచ్చే ఇళ్ల విషయంలో అనేక అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు.
నాణ్యత తీసికట్టుగా ఉండే ఇళ్ల విషయంలో ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లతోనే మళ్లీ మరమ్మతులు కూడా చేయించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఏమైనా తేడాలు వస్తే కనుక అదే కాంట్రాక్టర్ల నుంచి ఖర్చుపెట్టిన సొమ్ము రికవరీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో జగనన్న ప్రభుత్వమే కదా అని అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, నాసిరకంగా పేదల ఇళ్లను నిర్మించి అడ్డంగా దోచుకోవాలని అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. రికవరీల దాకా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన లంచాలు, వాటాలు ఏవీ తిరిగి దక్కవని జగనన్నను నమ్ముకుని పనులు చేసినందుకు పూర్తిగా నట్టేట మునుగుతామని ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.