ఆ సమాధానాలు చాలు.. తప్పుడు మనుషులని తెలియడానికి !

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి, చంద్రబాబు నాయుడు నివాసం మీద జరిగిన దాడి కేసులలో నిందితులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఎట్టకేలకు పోలీసు విచారణకు మంగళగిరి స్టేషన్ కు హాజరయ్యారు. అరెస్టు జరగకుండా ముందస్తు బెయిలు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, ఇన్ని రోజులుగా పరారీలో ఉన్న నాయకులు చివరికి విచారణకు హాజరు కావడం విశేషం. ‘కనిపించిన వెంటనే అరెస్టు చేస్తారు’ అన్నంతగా వాళ్ళు బిల్డప్ ఇచ్చినప్పటికీ అలాంటిదేం జరగలేదు. పోలీసులు వారిని కేవలం కొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి తిప్పి పంపారు. అయితే పోలీసు ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలను గమనిస్తే చాలు.. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంతటి తప్పుడు మనుషులో ఇట్టే అర్థమవుతుంది.

ఇలాంటి దాడులు దుర్మార్గాలు జరిగినప్పుడు నిందితులు పోలీసు విచారణ దాకా వస్తే ఆ ప్రశ్నలకు ‘తెలియదు .. గుర్తులేదు..’ లాంటి విచిత్రమైన సమాధానాలు చెప్పడం సర్వసాధారణం. అంతకంటే విచిత్రమైన సమాధానాలతో ఈ వైసీపీ నాయకులు విచారణకు సిద్ధమై రావడం విశేషం. మీ ఫోన్లు కావాలని అడిగితే … మేము అసలు ఫోన్లనే వాడము, మా ఫోన్లను ఎవరెవరో వాడుతారు, ఇప్పుడు కూడా మా ఫోన్లు మా వద్ద లేవు, ఎవరి వద్ద ఉన్నాయో తెలియదు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యాయో తెలియదు, వరదల కారణంగా వాటిని స్విచ్ ఆఫ్ చేసి ఉంచాము.. లాంటి అతి విచిత్రమైన సమాధానాలను విచారణలో ఈ నాయకులు పోలీసులకు చెప్పారు. విచారణకు ఈ నాయకులు ఏ మాత్రం సహకరించలేదని ఆ తర్వాత డిఎస్పి విలేకరులకు తెలియజేశారు. శనివారం నాడు పగలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి విచారణకు హాజరుకాగా మాజీ మంత్రి జోగి రమేష్ మాత్రం రాత్రి 8 గంటలకు వచ్చారు. వీరు పోలీసు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా పాస్ పోర్టులను మాత్రం పోలీసులకు అప్పగించారు.

పోలీసు విచారణకు సహకరించని నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు ఎందుకు పరారీలో ఉన్నారని పోలీసులు ప్రశ్నిస్తే.. అసలు తాము ఇళ్లలోనే ఉన్నామని బయటకు రాలేదని సదరు నాయకులు చెప్పడం విచిత్రం. మొత్తానికి పోలీసు విచారణకు హాజరు కాకుండా ఎంతో ఎక్కువ కాలం తప్పించుకు తిరగలేం అనే వాస్తవం వైసీపీకి చెందిన ఈ అతివాద నాయకులకు బోధపడినట్టుగా కనిపిస్తోంది. న్యాయనిపుణులను సుదీర్ఘంగా సంప్రదించిన తర్వాతే వీరు పోలీసు విచారణకు హాజరైనట్లుగా సమాచారం. ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే గనుక తక్షణం బెయిల్ ఇప్పించుకోవడానికి తగిన విధంగా న్యాయనిపుణులతో సమాధానాలు సిద్ధం చేయించుకుని వీరు విచారణకు హాజరైనట్లుగా పలువురు భావిస్తున్నారు. ఈ దాడుల కేసుల్లో విచారణ- ముందు ముందు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories