పెద్దిరెడ్డి సీనియర్ కు ఈ తీర్పు ప్రమాద ఘంటికే!

సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తాజా తీర్పు.. వైఎస్ జగన్ హయాంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పైకి చూడడానికి ఏదో భిన్నమైన అంశంపై వచ్చిన తీర్పులాగా కనిపిస్తున్నది గానీ.. రాష్ట్రంలో ఇతర పరిణామాలను కూడా ముడిపెట్టి గమనిస్తే.. భవిష్యత్ ప్రమాదం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే అని ప్రజలకు అర్థమవుతోంది. విషయంలోకి వెళితే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన అయిదేళ్ల కాలంలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టినందుకు జేపీ వెంచర్స్  కంపెనీ మీద ఎన్జీటీ వారు 18 కోట్ల జరిమానా విధించారు. ఈ జరిమానాను రెండు వారాల్లోగా డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు.. ఇంచుమించుగా వైఎస్సార్ కాంగ్రెస్ పరిపాలన కాలంలో ఇసుక అక్రమ తవ్వకాలను ధ్రువీకరిస్తున్నట్టే లెక్క.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. అయిదేళ్ల పాలన కాలంలో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ముందుగానే నిర్ణయించుకున్న టార్గెట్ లతో కొన్ని కొత్త విధానాలను తీసుకువచ్చారు. వాటిలో లిక్కర్, ఇసుక విధానాలు చాలా కీలకమైనవి. ఇసుక వ్యాపారంలో వందల వేల కోట్లు దోచుకోవడానికి ఆస్కారం ఉన్నదని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. ఉన్న పాలసీని రద్దు చేసేసి, రాష్ట్రంలో ఇసుక దొరకకుండా దాదాపు ఏడాది పాటు నిర్మాణరంగాన్ని స్తంభింపజేశారు. ఆ రంగంపై ఆధారపడిన కూలీల ఆకలిచావులకు కారణం అయ్యారు. అలా అందరి ప్రాణాలను బలితీసుకుని, చివరికి కొత్త ఇసుకపాలసీ తెచ్చి.. బీభత్సమైన రేట్లకు అమ్మడం ప్రారంభించారు. పర్మిట్లకు, అమ్మకాలకు సంబంధం లేకుండా.. విచ్చలవిడిగా దోచుకున్నారు.

జగన్ ఎంచుకున్న రెండు ప్రధాన దోపిడీ మార్గాలైన ఇసుక, లిక్కర్ రెండు వ్యాపారాలూ ఎలాంటి డిజిటల్  పేమెంట్స్ లేకుండా నగదురూపంలోనే జరిగాయి. లిక్కర్ కుంభకోణానికి పెద్దిరెడ్డి జూనియర్ మిథున్ రెడ్డి సారథ్యం వహిస్తే, ఇసుక దోపిడీకి పెద్దిరెడ్డి సీనియర్  రామచంద్రారెడ్డి కేంద్రబిందువుగా నిలిచారు. ఇటీవలే విజిలెన్సు అధికారులు.. ఇసుక దోపిడీ గురించి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దరిమిలా విచారణలు ఇంకా మొదలు కాలేదు. ఈలోగా.. జేపీ వెంచర్స్ వారి తవ్వకాలు రూపేణా అక్రమాలు జరిగిన సంగతి నిజమే అని ధ్రువీకరిస్తున్నట్టుగా సుప్రీం తీర్పు వెలువడింది. వీరికి గతంలో ఎన్జీటీ 18 కోట్ల జరిమానా విధిస్తే, వారు స్టే తెచ్చుకున్నారు. ఈ స్టేను తాజాగా సుప్రీం కోర్టు తొలగించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్రకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లలో ఈ తీర్పు వచ్చింది.

దీని తరువాత స్టెప్.. ఇసుక దోపిడీపై విచారణే అవుతుందని.. ఆ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్న అక్రమాలన్నీ బయటకు వస్తాయని ప్రజలు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories