సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతకాలం క్రితం జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ ఊపు మీదే లాల్ సలామ్ చేసి బోల్తా పడ్డారు. రజినీ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయాన్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
కాగా ఈ మూవీ తరువాత తలైవా తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కళుగు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే తాజాగా ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్‌లో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూతురు ఇప్పుడు రజినీకాంత్ కు కూతురుగా నటించనుండటం విశేషం అని చెప్పాలి. దాదాపు మూడేళ్ల తరువాత శృతి హాసన్ కు కోలీవుడ్ లో నటించే అవకాశం దక్కింది. తాజాగా శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు అదే లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ కు కూతురుగా శ్రుతి నటించనుంది.