చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకురావడం గురించి కసరత్తు చేస్తున్నది. ఎలాంటి విమర్శలకు కూడా అవకాశమే లేకుండా ఉండేలా.. చాలా పటిష్టంగా ఈ మద్యం విధానం రూపొందిస్తున్నారు. ఆరు రాష్ట్రాల్లో సుదీర్ఘ అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించాలని అనుకుంటున్నారు. మొత్తానికి నెలాఖరులోగా కొత్త మద్యం పాలసీ తయారయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులోని ఒక అంశం.. జగన్ దళం ప్రముఖులకు బినామీలుగా ఉంటూ వ్యాపారాలు ప్రారంభించిన వారిపై పిడుగుపాటులాగా వినిపిస్తోంది.
అప్పట్లో ఎన్నికల స్టంటులాగా కొందరు ఎద్దేవా చేశారు.. కొందరు వైసీపీ నాయకులకు అమ్ముడుపోయి నానా మాటలు అన్నారు. కానీ, చంద్రబాబునాయుడు తమ కూటమి గెలిస్తే.. ప్రజలకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచుతానని చెప్పిన మాటలకు విలువ దక్కింది. అంటే ప్రజల ఆరోగ్యాన్ని గుల్లబారేలా చేసే మద్యానికి చెల్లుచీటి పలుకుతామని ఆయన చెప్పారు. కానీ వైసీపీ ఆ మాటలను ఎగతాళి చేసింది. ప్రజలు మాత్రం నమ్మారు. ఎందుకంటే.. అయిదేళ్లుగా నకిలీ మద్యంలతో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న వారికి ఆ మాటల విలువ అర్థమైంది.
ఇప్పుడు కొత్త మద్యం విధానంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా రాష్ట్రంలోనూ అందుబాటులో ఉంచాలని డిసైడ్ చేశారు. అలాగే.. గత ప్రభుత్వం తెచ్చిన నాణ్యతలేని మద్యం బ్రాండ్లకు చెల్లుచీటీ ఇచ్చేశారు. ఈ నిర్ణయమే జగన్ దళం కు అశనిపాతంగా మారనుంది. జగన్ సీఎం అయ్యాక పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి ఇలా పలువురు పెద్దోళ్లు తమ బినామీలతో.. రాష్ట్రంలో ఉన్న బ్రూవరీలు, బెవరేజెస్ వ్యాపారాలను హస్తగతం చేసుకున్నారు. బినామీల ముసుగులో బెదిరించి ఆ వ్యాపారాలను కొనుక్కున్నారు. వారు తయారుచేసే మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో ఇష్టమొచ్చిన ధరలకు అమ్మారు. అరాచకత్వం రాజ్యమేలింది. తీరా ఇప్పుడు చంద్రబాబు సర్కారు.. సరికొత్త నిర్ణయం తీసుకోవడంతో వారి నోట్లో మన్ను పడినట్టే. వారు బ్రూవరీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయిదేళ్లు చెలరేగిన వారు.. ఇప్పుడు ఆ బినామీ వ్యాపారాలను కోల్పోతారు. ఎవరికైనా అమ్మినా.. కొంటారో లేదో తెలియని సంగతి. ఎందుకంటే.. ఆ బ్రాండ్లకే మార్కెట్ లేకుండా పోయాక వ్యాపారం గల్లంతయినట్టే. ఆ రకంగా వైసీపీ వారి దోపిడీ పర్వానికి ఈ నిర్ణయం చెక్ పెట్టినట్టు అయిందని పలువురు అంటున్నారు.