సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ముగిసిన ప్రతిసారీ ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులు ఇవ్వడం ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రుల్లో ఒకరితో సంతకాలు పెట్టించుకుని రావాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాలక్రమంలో తల్లిదండ్రులతో టీచర్లు ఇంటరాక్ట్ కావడం.. పిల్లల ప్రోగ్రెస్ గురించి చర్చించడం, వారు తీసుకోవాల్సిన బాధ్యత గురించి తెలియజెప్పడం లాంటివి కూడా జరుగుతూ వచ్చాయి. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయలు- తల్లిదండ్రులతో కలిసి నిర్వహించే సమావేశాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకువస్తోంది. పాఠశాలలతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మమేకం అయ్యేలాగా, ఒక ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం ఏర్పడేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఈనెల 7వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1375 స్కూళ్లలో 99784 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మీటింగ్ రోజున ఆయా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను వారి తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది కేవలం ఒక చిన్న అంశంగానే కార్యక్రమం రూపొందించారు. ఉపాధ్యాయలుు- తల్లిదండ్రుల మధ్య ఆత్మీయమైన వారధి ఏర్పడేలా.. తద్వారా విద్యార్థుల వికాసానికి బాటలు తీరేలా ప్రణాళిక చేస్తున్నారు. మొత్తంగా ఒక పండుగలాగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. విద్యార్థికి సంబంధించిన సమస్త వివరాలతో ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే సమావేశంలో అంతా తల్లిదండ్రులదే పాత్రగా ఉంటుంది. రాజకీయనాయకులను, ప్రజాప్రతినిధులను పిలవకుండా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలను పర్యావరణ హితమైన వాటితోనే అలంకరించాలని నిర్ణయించారు. మామిడితోరణాలు, అరటి చెట్లతో అలంకరిస్తారు. తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు తాడులాగే పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికంటె గొప్ప నిర్ణయం ఏంటంటే.. ఆ సమావేశాలు జరిగేటప్పు.. పాఠశాలల వద్ద ఎలాంటి ఫ్లెక్సిలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు.
జగన్ పరిపాలన కాలంలో.. తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాలు అనేవి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత.. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి, ఎన్నికల పరంగా వారిని ప్రభావితం చేయడానికి అప్పటి అధికారి ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నించి.. ఈసీ అక్షింతలు వేయడంతో వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో.. తల్లిదండ్రుల- టీచర్ల సమావేశాలు అనేవి.. కేవలం విద్యార్థుల పురోగతి, సుహృద్భావ వాతావరణం కోసం మాత్రమే జరగబోతున్నాయి.