ప్రయాణంలో ఉన్న ఒక నావ నుంచి ముఖ్యమైన వ్యక్తులు నదిలోకి దూకేస్తున్నారు అంటే దాని అర్థం, ఆ నావ త్వరలో మునిగిపోబోతున్నదని! చిన్న సన్న వ్యక్తులు పార్టీని వీడిపోతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, చట్టసభలలో సభ్యులుగా కీలక పదవులు అనుభవిస్తున్న వారు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారంటే ప్రమాదకరమైన సంకేతాలు వస్తున్నట్టే లెక్క. ఆ పార్టీ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండబోతున్నదని వారందరూ నమ్ముతున్నట్లే లెక్క. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే విధంగా కనిపిస్తోంది.
ఆ పార్టీలో ఎమ్మెల్సీలుగా అధికార హోదాలను కలిగి ఉంటూ.. ఇంకా సుదీర్ఘకాలం తమకు పదవీయోగం ఉన్నప్పటికీ కూడా కొందరు పార్టీని వీడిపోతున్నారంటే ఆ పార్టీ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం కల్ల అని వారు నమ్ముతున్నట్లే భావించాలి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ ఆ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేను రాజుకు పంపారు.
ఇంకా తమ పదవీ కాలం కొన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం అనేది ఇది మొదటిసారి కాదు. ఇటీవలే కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ యాదవ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిన ఎమ్మెల్సీ పదవిని కూడా వద్దనుకుని జనసేనలో చేరారు. వంశీకృష్ణ జనసేన తరఫున ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
అయితే మహ్మద్ ఇక్బాల్ విషయంలో అలాంటి ఆశ కూడా లేదు. ఎందుకంటే.. అన్ని పార్టీలు ఇప్పటికే తమ తమ అభ్యర్థులను ప్రకటించడం పూర్తిచేశాయి. ఇక్బాల్ వేరే పార్టీలో చేరితే చేరవచ్చుగానీ.. ఆయనకు టికెట్ దక్కదు. కానీ, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తనను కరివేపాకులా వాడుకుని పక్కన పెట్టిన తీరుతో ఆయన విసిగిపోయి పార్టీకి రాజీనామా చేయడం విశేషం.
ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఇక్బాల్ గతంలో అనంతపురం రేంజి ఐజీగా పనిచేశారు. రిటైర్మెంటు తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే ఉద్దేశంతో వైసీపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయనకు ఏం హామీ ఇచ్చారో తెలియదు గానీ.. తీరా 2019 ఎన్నికలు వచ్చినప్పుడు.. హిందూపురంలో బాలక్రిష్ణపై పోటీచేయాల్సిందిగా ఆయనను పురమాయించారు. అయిష్టంగానే కొత్త ప్రాంతానికి వెళ్లిపోటీచేసిన ఇక్బాల్ ఓడిపోయారు. తరవాత ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. అక్కడ పార్టీ కోసం పనిచేయమని చెప్పింది. ఆయన హిందూపురంలో పార్టీని బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ.. చివరికి పెద్దిరెడ్డి జోక్యంతో అక్కడ దీపికను అభ్యర్థిగా ప్రకటించి.. ఇక్బాల్ కు మొండిచెయ్యి చూపించారు. ప్రత్యామ్నాయంగా కదిరి లో ఎమ్మెల్యేటికెట్ ఇస్తామన్నారు గానీ.. ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. పార్టీ తనను చిన్నచూపు చూస్తున్నదంటూ కొన్ని రోజులుగా మధనపడుతున్న ఇక్బాల్.. చివరికి పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. కాకపోతే.. ఆయన ఇప్పుడు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది కీలకంగా ఉంది. తెదేపా, జనసేనలలో ఒక పార్టీని ఎంచుకుంటారా? లేదా, కాంగ్రెసులో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటారా? అనే చర్చ నడుస్తోంది.