డిజి హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్ని రకాలుగా వేధించిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మీద కక్ష కట్టినట్లుగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది. న్యాయపోరాటం ద్వారా ఏబీ వెంకటేశ్వరరావు తన నియామకానికి సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ.. మళ్లీ మళ్లీ ఆయనను సస్పెండ్ చేయడం ద్వారా వేధించడమే తమ లక్ష్యం అని ప్రభుత్వం నిరూపించుకుంది. ఆయనకు పోస్టింగ్ లేకుండా పదవీ విరమణ చేయించాలని కూడా కుట్ర పన్నింది ప్రభుత్వం. అయితే ఏ వ్యవహారంలో అయినా సరే అంతిమ విజయం ధర్మానిదే అవుతుంది అని ఏబి వెంకటేశ్వరరావు ఉదంతం ప్రజలకు స్పష్టం చేసింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయనను అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు. ఆ ఆరోపణలను ఆయన ప్రభుత్వం ఈ ఐదేళ్లలోనూ నిరూపించలేకపోవడం కనీసం చార్జిషీట్ కూడా వేయలేకపోవడం ఒక విశేషం. పరికరాలు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీవీని ప్రభుత్వం తొలుత సస్పెండ్ చేసింది. దానిపై క్యాట్ నువ్వు ఆశ్రయించిన ఏబీవీ, సానుకూల ఫలితం రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. అటు నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆయనను తక్షణం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అప్పట్లో తిరిగి పోస్టింగ్ ఇచ్చింది కానీ.. స్వల్ప వ్యవధిలోని పాత కారణాల మీదనే మళ్లీ సస్పెండ్ చేసింది.
ఒకే కారణం మీద రెండు సార్లు సస్పెండ్ చేయడం కుదరదు అంటూ ఏబీ వెంకటేశ్వరరావు మళ్ళీ క్యాట్ ను ఆశ్రయించారు. ఆయనకు తక్షణం నియామకం ఇవ్వాలని క్యాట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జగన్ సర్కారు ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా.. వాటిపై హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయనేది వేరే సంగతి. కానీ అసలు పోస్టింగు లేకుండా ఏబి వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేసి వెళ్లాలని ఒక్కటే ప్రభుత్వం కుట్రగా అందరూ గుర్తించారు.
మే 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా 30వ తేదీన రాష్ట్ర హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇస్తూ తక్షణం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎస్ కు ఇక అమలు చేయక తప్పలేదు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ కమిషనర్ హోదాలో ఆయన పదవీ విరమణ చేశారు. ధర్మాన్ని రక్షించడానికి తన రిటైర్మెంట్ శేష జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయనను వేధించదలచుకున్న ప్రభుత్వం ఎత్తుగడలు సాగలేదు. యూనిఫామ్ తో రిటైర్ అవుతుండడం ఎంతో గర్వంగా ఉందని ఏబీవీ చెప్పిన మాటలు.. జగన్ ప్రభుత్వానికి చిట్ట చివరి చెంపపెట్టు లాంటివని ప్రజలు భావిస్తున్నారు.