లిక్కరు దోపిడీ పర్వంలో చెవిరెడ్డి ముద్ర ఇదీ!

అంతిమంగా జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం ఒక్కటే వారందరి పరమార్థం. జగనన్న దోచుకోదలచిన ప్లాన్ కు తమ శక్తివంచన లేకుండా సహకరించడమే వారందరి ఉద్దేశ్యం. ఏకంగా మూడున్నర వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్న వ్యవహారంలో.. జగనన్న ప్లాన్ సక్సెస్ కావడానికి అందరూ తమ తమ తెలివితేటలను ఇతోధికంగా సరఫరా చేశారు. డిస్టిలరీలనుంచి నల్లధనాన్ని ఎలా వసూలు చేయాలో తమ తమ ప్రణాళికలను అమల్లో పెట్టిన వాళ్లు కొందరైతే.. నల్లధనంగా పోగుపడిన డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడానికి ఎన్నెన్ని వక్రమార్గాలు తొక్కవచ్చునో.. అన్ని రకాలుగానూ తోడ్పాటు అందించిన వారు అనేకులు. ఆ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా.. తన ముద్ర కలిగిన దందాల ద్వారా.. లిక్కర్ అక్రమార్జనలను వైట్ మనీగా మార్చుకోవడంలో కీలక భూమిక పోషించినట్టుగా సిట్ పోలీసులు గుర్తించారు.

చెవిరెడ్డి తండ్రీకొడుకులు ఇద్దరూ మద్యం కేసులో ఏ38, ఏ39 నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి అరెస్టు అయి రిమాండులో గడుపుతున్నారు. మీడియా కనిపించిన ప్రతిసారీ.. లిక్కర్ కుంభకోణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన పదేపదే అంటుంటారు. కాగా, తాజాగా సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రను నిర్ధారించే మరో ఆధారాల్ని రాబట్టారు. మద్యం కుంభకోణంలో కాజేసిన సొమ్ముతో వందల ఎకరాల భూములు కొన్నట్టుగా , పెద్దస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా కనుగొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే.. చెవిరెడ్డి ముద్ర ఉన్న వ్యాపారం అన్నమాట.

చెవిరెడ్డి భాస్కర రెడ్డికి చెందిన కల్యాణ్ వెంకటేశ్వరస్వామి ఇన్ ఫ్రా (కేవీఎస్ ఇన్ ఫ్రా) పేరుతో తిరుపతి జిల్లా గూడూరుసమీపంలో 6 కోట్లరూపాయలో 260 ఎకరాల భూమిని కొన్నారు. ఇదంతా కేవలం నగదు రూపంలోనే చెల్లించారు. ఆ తరువాత రెండు నెలల వ్యవధిలోనే 26 కోట్ల రూపాయలకు అరబిందో సంస్థ ప్రతినిధి శరత్ చంద్రారెడ్డికి విక్రయించారు. ముడుపుల ద్వారా వచ్చిన బ్లాక్ మనీని ఇలా వైట్ లోకి మార్చిన తరువాత.. తిరుపతి పరిసరాల్లో అనేక మంది భూయజమానులతో డెవలప్మెంటు అగ్రిమెంట్లు చేసుకుని.. పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసినట్టుగా సిట్ తమ దర్యాప్తులో తేల్చింది.

తండ్రి దోపిడీకి సహకరించడానికేనా అన్నట్టుగా.. చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఆ సమయంలో తుడా ఛైర్మన్ గా ఉన్నారు. ఇక రాజు తలచుకుంటే కొదవేముంది అన్నట్టుగా.. తుడా నిధులతోనే ఈ లే అవుట్లు అన్నింటికీ రోడ్లు కూడా వేశారు. మౌలిక వసతులు కల్పించారు. అలా ఆ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. చెవిరెడ్డి దోపిడీ పర్వం మాత్రమే కాదు.. గూడూరు దగ్గర భూముల్ని కొన్న శరత్ చంద్రారెడ్డి ఆ భూముల్ని కన్వర్షన్ చేయించుకుని.. వాటి విలువ ఇబ్బడిముబ్బడిగా పెంచేసుకున్నాు. వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి.. భారీ మొత్తాల్లో రుణాలు పొందినట్టు కూడా తేల్చారు. మొత్తానికి లిక్కర్ కుంభకోణంలో ఎవరికి వీలైనంత వారు ఎడాపెడా దోచుకుని.. అంతా పంచుకున్నారని అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories