ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే కాదు.. భిన్న భాషలు సంస్కృతులకు నిలయమైన భారతదేశంలోనే రాష్ట్రాలు సరిహద్దుల పరంగా కాకుండా, భాషాప్రయుక్తంగా ఏర్పడాలనే విధానం రూపొందడానికి మూలకారకుడైన త్యాగశీలి, అమరజీవి పొట్టి శ్రీరాములు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్2తో మద్రాసు నగరంలోనే ఏకంగా 58 రోజుల పాటూ నిరాహారదీక్ష చేసిన ఆ మహనీయుని త్యాగఫలంగానే అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆలోచనలో మార్పువచ్చింది. ఈ దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలాంటి మహనీయుడి త్యాగానికి మన తెలుగు రాష్ట్రాల్లో దక్కిన గౌరవం మాత్రం చాలా తక్కువే. అయితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తాజా నిర్ణయం ద్వారా.. ఈ అమరజీవికి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు.
మార్చి 16 పొట్టి శ్రీరాములు జయంతి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా.. 58 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ విగ్రహం చుట్టూ స్మారక పార్కు ఏర్పాటుచేస్తాం అని అన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఒక మ్యజియం ఏర్పాటుచేయబోతున్నట్టుగా కూడా వెల్లడించారు. అమరావతిలో ఒక స్మారక పార్కు, 58 అడుగుల విగ్రహం ఏర్పాటుచేయాలనే చంద్రబాబు నిర్ణయం ఆ మహనీయుడికి గొప్ప నివాళి అని ఆంధ్ర రాష్ట్రం మొత్తం హర్షిస్తోంది.
మదరాసు రాష్ట్రంలో భాగంగానే శ్రీకాకుళం వరకు కూడా తెలుగు ప్రాంతం ఒక భాగంగా ఉండేది.
తమిళుల పెత్తనంలో తెలుగుప్రాంతాల వారికి ఎలాంటి న్యాయం జరిగేది కాదు. ఈ వివక్షను అడ్డుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు. కేంద్రం పట్టించుకోలేదు. 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తూ నానాయాతనలు పడి మరణించారు. ఆయన మరణం తర్వాత.. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఒక ఉద్యమంగా, పోరాటంగా మారింది. కేంద్రం దిగివచ్చి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుచేసింది.
అయితే ఇన్నాళ్లుగా కూడా పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వాలపరంగా సరైన గౌరవం దక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో పాఠంగా పెట్టడమూ, జయంతులు, వర్ధంతులు నిర్వహించడం తప్ప ప్రత్యేకమైన గౌరవం లేదు.
ఆయనను ఒక కులానికి చెందిన నాయకుడిగా గుర్తించినట్లుగా ఆ కులం వాళ్లు బలంగా ఉన్నచోట విగ్రహాలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. అలాంటిది.. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58వ అడుగుల ఎత్తుతో.. రాష్ట్రం గర్వించే అమరావతి రాజధానిలో ఏర్పాటుచేసి, స్మారక పార్కు కూడా నిర్మించడం మంచి విషయం అని ప్రజలు అభినందిస్తున్నారు.