తెలంగాణకు చంద్రబాబు ప్రకటించిన కానుక ఇది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీతో ఉండే సన్నిహిత సంబంధాలను సక్రమంగా వాడుకుంటూ రాష్ట్ర విస్తృత పురోగమనానికి ఆయన పునాది వేస్తున్నారు.  ఒక దార్శనికుడు అభివృద్ధికి రూపకల్పన చేయడం అనేది కేవలం తన కోసం మాత్రమే కాకుండా ఇరుగుపొరుగు అందరికీ కూడా ఉపయోగపడేలా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అభ్యర్థించి రాష్ట్రం కోసం తీసుకురాదలచుకుంటున్న కొన్ని కొత్త ప్రాజెక్టులను గమనిస్తే పొరుగు రాష్ట్రాలకు అపరిమితమైన లబ్ధి చేకూరుతుందని మనకు అర్థమవుతుంది.  ప్రత్యేకించి సముద్రతీరం లేని తెలుగు రాష్ట్రం తెలంగాణకు ఒక డ్రై పోర్టు అందుబాటులోకి వచ్చే ప్రణాళికతో చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెడుతూ ఉండడం గమనార్హం.

ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి- కేంద్ర ప్రభుత్వంలోని పలువురు పెద్దలను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సహకరించాల్సిందిగా కోరారు. వీటిలో జాతీయ రహదారులు, పారిశ్రామికవాడలు, బుల్లెట్ రైలు లాంటి అనేకం ఉన్నాయి. హైదరాబాదు నుంచి అమరావతికి బుల్లెట్ రైలు అనే స్వప్నాన్ని కూడా సాకారం చేయడానికి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిత్వ శాఖ వద్ద ప్రతిపాదించారు. అదేవిధంగా హైదరాబాదు విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని మరింత విస్తరించే ఆలోచన కూడా కేంద్రంతో ఆమోదింప చేసే ప్రయత్నంలో ఉన్నారు. . అలాగే హైదరాబాదు విజయవాడ మధ్య ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రూపకల్పనకు ఆయన ప్లాన్ చేస్తున్నారు.  ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే హైదరాబాదు నుంచి మచిలీపట్నం (బందరు) వరకు ఉంటుంది.  ప్రస్తుతానికి పోర్టు సదుపాయానికి అవకాశం కూడా లేని తెలంగాణ రాష్ట్రానికి ఒక డ్రైపోర్టు కావాల్సి ఉన్నదని చంద్రబాబునాయుడు చెబుతుండడం విశేషం. దార్శనికుడైన నాయకుడు గనుక కేవలం తన సొంత రాష్ట్రం గురించి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. 

డ్రైపోర్టు సదుపాయం కూడా ఉంటే తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రం మరింతగా వెలుగొందే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణకు కూడా కొత్త పరిశ్రమలు రావడం జరుగుతుంది. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం చాలా వరకు సన్నగిల్లినప్పటికీ- ఏపీతోపాటు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా సమానంగా కాంక్షించే నాయకుడిలాగా చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం గమనార్హం.  ఆయన శ్రద్ధ పట్ల తెలంగాణ ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ద్వారా మచిలీపట్నం పోర్టు వరకు మార్గం సుగమం అయితే చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు నీరాజనం పడతారు అనడంలో సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories