రాజకీయాల్లో ప్రతి అడుగూ తాము అనుకున్నట్టుగా పడుతుందని అనుకోవడం భ్రమ. మనం సొంత డబ్బా కొట్టుకుంటూ వెళ్లిపోతుంటే మధ్యలో ప్రశ్నించేవారు కూడా ఉంటారు. మన అభిప్రాయాలతో విభేదించేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని కూడా సహించగలిగే ఓర్పు సంయమనం సహనం అనేవి రాజకీయ నాయకుడికి ఉండాలి. అవి లేకపోతే వారే భ్రష్టు పట్టిపోతారు. సహనం లేకుండా దౌర్జన్యాలకు దిగితే నష్టం జరిగేది వారికే. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక సంఘటన జరిగింది. మధ్యలో జగన్ వీరాభిమాని ఒకడు వచ్చి.. ఆమెను అడిగి మైకు తీసుకున్నాడు. తీసుకున్నదే తడవుగా.. షర్మిల మీద విమర్శలు కురిపించడం ప్రారంభించాడు. ఒకరేంజిలో విమర్శించాడు. జగనన్నను కీర్తించాడు. షర్మిల ఏపీకి రావడమే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. అంతా అయ్యాక మైకు తీసుకుని అతణ్ని పంపేసింది షర్మిల. అంతకుమించి అక్కడేం ఘోరాలు జరగలేదు.
కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రీతిగా సహనంగా స్పందిస్తారా? ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. అంతే సంయమనం చూపించగలరా? ఆ విషయం ఇప్పుడు పాణ్యం వైకాపా అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు ఆయన అనుచరులు నిరూపించారు.
కాటసాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. కొన్ని అబద్ధాలు వల్లించారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు రద్దు అయ్యాయని, ఆ హామీలను నమ్మవద్దని ఆయన అన్నారు. దీంతో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సలాం స్పందించి తప్పుడు ప్రచారాలు చేయవద్దని, సూపర్ సిక్స్ రద్దయ్యాయని ఎవరు చెప్పారు.. అంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా కాటసాని అనుచరులు సలాంపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే వారిని వారించడానికి కూడా ప్రయత్నించలేదు.
దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు.. ఆయన ప్రచార వాహనాన్ని అడ్డగించారు. గ్రామ సర్పంచి సహేరా బీ కూడా ఎమ్మెల్యేను నిలదీశారు. అబద్ధాలు ప్రచారంచేస్తున్నారా, దాడులుచేస్తూ ఉంటే మేం గ్రామంలో ఉండాలా వద్దా? అంటూ నిలదీశారు.
ఇదిరెండు పార్టీల మధ్య ఉండే వ్యత్యాసం. అధికార పార్టీ వారు ఎంతగా భయంలో కొట్టుమిట్టాడుతున్నారంటే.. వారిని నిలదీయడాన్ని, వారి అబద్ధాలను ప్రశ్నించడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇది వారిలో ఓటమి గురించిన భయానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.