ప్రజల ఆశల సౌధానికి ఇది శ్రీకారం!

శుక్రవారం నాడు.. అమరావతి వేదికగా.. ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు జరగబోతున్నాయి. అయిదేళ్లపాటు అమరావతి రాజధాని నగరాన్ని స్మశానంగా మార్చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తే.. ఆ దుర్గతిని తప్పించి.. రాజధానిని తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకునేలా అద్భుతంగా నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సుమారు 49వేల కోట్ల అమరావతి పనులకు, అలాగే మరో 57 వేల కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

అయితే రాష్ట్రపజలందరూ కీలకంగా గమనించాల్సిన సంగతి ఏంటంటే.. ఇది కేవలం ఒక నగర నిర్మాణానికి జరుగుతున్న శంకుస్థాపన మాత్రమే అనుకుంటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజావాహిని మొత్తం ఎన్డీయే కూటమి మీద నిర్మించుకున్న ఆశల సౌధానికి చేస్తున్న శంకుస్థాపనగా పరిగణించాల్సి ఉంది. అవును ప్రజల ఆశలు నెరవేరడం అనే ప్రక్రియకు  మోడీ కార్యక్రమాన్ని శ్రీకారంగా భావించాలి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క చాన్స్ అప్పగిస్తే రాష్ట్ర పరిపాలన మొత్తం గాడితప్పిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేయడం తప్ప.. పరిపాలన అంటే మరొకటి లేదు అన్నట్టుగా జగన్ ప్రవర్తించారు. కనీసం అయిదేళ్ల పాటూ ప్రజలను కూడా కలవకుండా.. ఆయన నియంతృత్వ పాలనను సాగించారు. జగన్ పైన హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారంటే.. కింద రోడ్ల మీద ఉండే చెట్లను నరికేయించే దుర్మార్గమైన సంస్కృతి, ప్రజలు రోడ్డమ్మట వెళ్లే ముఖ్యమంత్రి కాన్వాయ్ ను కూడా చూడడానికి అవకాశం లేకుండా రోడ్డుకిరవైపులా పరదాలు కట్టించే సంస్కృతి రాజ్యమేలాయి. ప్రజలు వీటితో విసిగిపోయారు.
చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా.. ప్రపంచం మనవైపు తలతిప్పి చూసేలా.. అమరావతి రాజధాని కావాలనే అనుకున్నారు. దానికి జగన్ చేసిన ద్రోహాన్ని వారు క్షమించలేకపోయారు. అందుకే ఎన్డీయే కూటమి పార్టీలను 93 శాతం సీట్లతో ఘనంగా గెలిపించారు. అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అనేది.. ప్రజల ఆశల సౌధాన్ని పూర్తిచేయడానికి శ్రీకారం చుట్టడమే అవుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దేశం ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల మధ్య కూడా అమరావతి శంకుస్థాపనల కోసం సమయం కేటాయించి వస్తున్న ప్రధానికి రాష్ట్ర ప్రజలు  ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజల ఆకాంక్షలు తీరేలా రాజధాని అమరావతి నిర్మాణం ఉంటుందని చంద్రబాబునాయుడు ప్రకటించడం ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంచుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories