ఏదో ఒక రకంగా రాష్ట్రంలో నలుమూలలా రాద్ధాంతం చేస్తూ ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మీద ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నట్టుగా బిల్డప్పులు ఇవ్వడానికి.. తద్వారా ఏదో జరిగిపోతున్నదని ప్రజలను తప్పుదారి పట్టించడానికి వారు పాట్లు వారు పడుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సూత్రధారిగా వక్ర రాజకీయ నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా కల్పించలేదు అనే పాయింట్ మీద నిరసనలను ‘ఏర్పాటు’ చేస్తున్నారు భూమన! ఉగాది నాటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించిన తర్వాత.. పది రోజుల ముందు ఇలాంటి కుటిలరాజకీయాలు చేయడం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు !
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ కొనకుండా గొడవ చేశారు. వారు టికెట్ కొనడం లేదని కండక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం గురించి నినాదాలు చేస్తూ, ‘ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనవద్దని, టిక్కెట్ డబ్బులు అడిగితే తన పేరు చెప్పాలని’ గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారని, అందువల్ల చంద్రబాబు పేరు చెబుతాం తప్ప టిక్కెట్ కొనబోము అని మొండికేశారు.
అయితే ఉగాది నాటినుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానున్నట్టు చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ సమయంలో ఆందోళన పేరిట డ్రామాలు ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఏపీలో చంద్రబాబు పాలనతో తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అసహనానికి గురవుతున్నారని ప్రజలు అంటున్నారు. పైగా తిరుపతి మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేక భూమన ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ధోరణి ఎలా ఉన్నదంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ రెండో రోజే కార్యరూపంలోకి వచ్చేయాలన్నట్టుగా అంటున్నారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రజలు అయిదేళ్ల గడువుతో అధికారం కట్టబెట్టటారనే వాస్తవాన్ని విస్మరించి.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వక్ర రాజకీయాలు చేస్తుండడం వారి పట్ల ప్రజల్లో అసహ్యం పుట్టిస్తోంది.