రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ధనమయం అయిపోయాయి. ఎమ్మెల్యేగా ఎన్నికల్లోపోటీచేయడం అంటేనే.. కనీసం 30 నుంచి 50 కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధపడి ఉండాల్సిన పరిస్థితి. సంపన్నులు, కుబేరులు తలపడే కీలక నియోజకవర్గాల్లో ఈ ఖర్చు కాస్తా వందకోట్లకు వెళ్లినా కూడా ఆశ్చర్యం లేదు. పార్టీలు కూడా వందకోట్లు పెట్టగల ప్రత్యర్థికి సమానమైన వాళ్లనే ఎంపిక చేస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు. ప్రజాబలాన్నే నమ్ముకుని, తన చిత్తశుద్ధిని, తన చిత్తశుద్ధి మీద ప్రజల్లో ఉండగల విశ్వసనీయతను నమ్ముకుని రాజకీయం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన ప్రత్యర్థులకు ఒక సవాలు విసురుతున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. వర్తమాన రాజకీయాల్లో కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే విసరగలిగిన సవాలు అది!
పిఠాపురం ఇన్నాళ్లపాటు జనసేన ఇన్చార్జిగా ఉంటూ పార్టీ కార్యకలాపాలను చూస్తూ వచ్చిన తంగెళ్ల ఉదయ్ ను ఇప్పుడు కాకినాడ ఎంపీ స్థానం అభ్యర్థిగా ప్రకటించారు పవన్. ఆ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన తన పోటీ గురించి కూడా ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. తనను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు.. ఒక్కోకుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి తద్వారా.. 100 నుంచి 150 కోట్లరూపాయలు పిఠాపురంలో ఖర్చుపెట్టడానికి ప్లాన్ చేసుకున్నారంటూ పవన్ ఆరోపించారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారని కూడా అన్నారు. కుటుంబానికి లక్షకాదు కదా.. ఒక్కో ఓటరుకు లక్ష రూపాయలు ఇచ్చినా సరే.. ప్రజల దీవెనలతో తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ప్రస్తుతం ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్న తరుణంలో ఈ స్థాయిలో ప్రత్యర్థులకు సవాలు విసరడం అనేది ఏ నాయకుడికీ కూడా సాధ్యమయ్యే సంగతి కాదు.
పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా గత ఎన్నికల్లో 90 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. అప్పటి తెదేపా ప్రత్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరారు గానీ.. అక్కడ ఆయన బీటెక్ రవి తో తలపడాల్సి ఉంది. మారిన పరిస్థితులు, వివేకా హత్యానంతరం పోయిన క్రెడిబిలిటీ, వివేకా కుటుంబసభ్యులు కాంగ్రెస్ తరఫున పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం నేపథ్యంలో.. జగన్ కూడా తాను లక్ష మెజారిటీతో గెలుస్తానని చెప్పగల పరిస్థితి లేదు. అలాంటిది.. పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారిగా అడుగుపెడుతూ.. పవన్ కల్యాణ్ తాను లక్ష మెజారిటీతో గెలుస్తానని సవాలు విసురుతున్నారంటే గొప్ప విషయమేనని పలువురు అభినందిస్తున్నారు.