అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు రుజుమైన నేపథ్యంలో వేటుకు గురైన ఎస్పీలు, కలెక్టర్లకు బదులుగా కొత్తవారి నియామకం తాజాగా పూర్తయింది. అయితే కొత్తగా నియమితులైన వారు కూడా.. గతంలో తమ తమ అధికార బాధ్యతల్లో అధికార పార్టీకి కొమ్ముకాసిన వారే అనే సంగతి వెలుగులోకి వస్తోంది. వేటుకు గురైన వారి స్థానంలో నియమించేందుకు ఒక్కొక్క స్థానానికి ముగ్గురేసి పేర్లతో ప్రతిపాదనలు పంపాలని ఈసీ , ఏపీ చీఫ్ సెక్రటరీ ని కోరింది. సీఎస్ జవహర్ రెడ్డి.. పనిగట్టుకుని.. వైసీపీకి అనుకూలంగా ఉండగల అధికారుల పేర్లను మాత్రమే పంపినట్టు ఇప్పుడు నిరూపణ అవుతోంది. వీరి పేర్లను సిఫారసు చేయడం ద్వారా.. సీఎస్ జవహర్ రెడ్డి ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం తీసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలే సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ల వ్యవహార సరళి మీద ఈసీ వద్ద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అధికార పార్టీకి మేలుచేసేలా వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం, జనసేన ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అసలే సీఎస్ వ్యవహార సరళి మీద బోలెడు అనుమానాలు వ్యాప్తిలో ఉండగా.. మళ్లీ అయిన ఇలా వ్యవహరించడం తన గోతిని తానే తవ్వుకోవడం వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నియమించిన ఆరుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ ల పరిధిలో.. రాబోయే రోజుల్లో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా, అధికార పార్టీకి వారు కొమ్ముకాస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చినా.. ఆ ప్రభావం వారిని సిఫారసు చేసిన సీఎస్ జవహర్ రెడ్డిమీద పడుతుంది.
ఈ ఆరోపణలు ఇంకాస్త ఎక్కువైతే కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా చీఫ్ సెక్రటరీని మార్చేసినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికలకు పూర్వం ఈసీ , చీఫ్ సెక్రటరీని మార్చిన వైనం అందరూ గుర్తుచేస్తున్నారు. కొత్తగా నియమితులైన వారిలో.. కొందరి గురించి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించడమే పనిగా గతంలో పనిచేసిన వారిని ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టుల్లో నియమించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి బదిలీల వల్ల అసలు ఉపయోగమే ఉండదని, ఇలా జరిగేట్లయితే.. ఎందరు అధికార్ల మీద ఈసీ వేటు వేసినా నిష్పాక్షికంగా ఎన్నికలు జరగబోవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.