భూస్వామ్య, పెత్తందారీ బుద్ధులకు నిలువెత్తు నిదర్శనం అయిన జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన ఐదేళ్ల పదవీకాలంలో అధికారులను బానిసల్లాగా చూశారనే సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేకించి పోలీసు అధికారులను తమ ఇంటి పాలేర్లలాగా వాడుకున్నారని, తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నారని, కొరుకుడుపడని వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. చింత చచ్చినా సరే పులుపు చావలేదన్న సామెత చందంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి అత్యంత దారుణంగా ఓడించినా సరే.. ఆయనలో భూస్వామ్య పెత్తందారీ అహంకారం మాత్రం తగ్గడం లేదు. పోలీస్ అధికారులను ఇప్పటికీ తన మోచేతి నీళ్లు తాగే బానిసల్లాగా చూడాలనుకునే ధోరణి మారడం లేదు. తాజాగా పులివెందుల పర్యటనలో ఆయన ఇదే దురహంకారాన్ని ప్రదర్శించారు.
వైయస్ జగన్ కు తమ్ముడు వరస అయ్యే వైయస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో హెలీపాడ్ వద్దకు పులివెందుల డిఎస్పీని పిలిపించి తీవ్రమైన పదజాలంతో హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకూ జగన్ అంతగా ఆగ్రహించేంతగా డి.ఎస్.పి చేసిన నేరమేమిటా అని ఆలోచిస్తున్నారా? సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన సైకోలను విచారించడమే ఆయన తప్పు! స్వయంగా జగన్ తల్లి, చెల్లెలి మీద అత్యంత నీచమైన, అసభ్యమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి లను పులివెందుల డిఎస్పి మురళి నాయక్ స్వయంగా విచారిస్తున్నారు, కేసుల తీవ్రతను బట్టి ఆ విచారణ పర్వం కూడా సాగుతోంది. అయితే ఈ విషయంపై స్థానిక వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి పితూరీలు చెప్పడంతో, హెలిపాడ్ వద్దకు డిఎస్పీని పిలిపించుకున్న జగన్ తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు.
‘‘ఈ ప్రభుత్వం రెండూ లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు.. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’’ అంటూ ఆయన హెచ్చరించడం విశేషం! జగన్ ఇలా కోప్పడుతున్నప్పుడు, ‘జాగ్రత్తగా ఉండా’లని హెచ్చరిస్తున్నప్పుడు డిఎస్పి మారు మాట్లాడకుండా సైలెంట్ గా విని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల ప్రజలలో, పోలీస్ అధికారుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన తల్లిని అసభ్యంగా నిందించిన వారిపై కేసులను విచారిస్తే కూడా జగన్ డిఎస్పీపై కక్ష కడతారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.